సాక్షి, అమలాపురం: సర్పంచ్ పదవితో పాటు వంద శాతం వార్డు సభ్యుల స్థానాలను ఏకగ్రీవం చేసుకునే పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇవ్వడం ఎప్పటి నుంచో ఉంది. పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో వివాదాలు తలెత్తకుండా నివారించడం, ఎన్నికల ఖర్చు తగ్గించడంతో పాటు గ్రామాభివృద్ధిని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే, ఇది గ్రామస్తులందరి సమష్టి నిర్ణయంతో జరగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ.
ఎన్నికలంటేనే పోటీ, ప్రచారం, ఖర్చులు, గెలుపోటముల ఉత్కంఠ. కానీ, ఈసారి పల్లెపోరులో సరికొత్త రాజకీయం తెర పైకి వస్తోంది. ఓట్లు అడగకుండానే, ప్రచారం చేయకుండానే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునే వ్యూహాలకు కూటమి నేతలు పదును పెడుతున్నారు. ఏకగ్రీవంగా పంచాయతీని కై వసం చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే నజరానా ఒకవైపు.. ప్రత్యర్థులు బరిలో లేకుండా చేసేందుకు ఆశావహులు ప్రకటిస్తున్న భారీ ఆఫర్లు మరోవైపు.. వెరసి ఏకగ్రీవాల మాటున పల్లెల్లో కొత్త రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. లక్షల రూపాయలతో మొదలైన ఈ వ్యవహారం కొన్నిచోట్ల కోటి రూపాయల స్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది.
ఒకరు అరకోటి.. మరొకరు కోటి ఆఫర్
అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న రెండు ప్రధాన పంచాయతీల్లో ఈ తరహా ప్రతిపాదనలు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. పేరూరు పంచాయతీ సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా తమకు అప్పగిస్తే రూ.50 లక్షలు ఇస్తామంటూ ఓ ఆశావహుడు భారీ ఆఫర్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బండారులంకలో ఏకంగా రూ.కోటి ఇస్తామంటూ మరో వ్యక్తి ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ ఇద్దరూ అధికార టీడీపీ సానుభూతిపరులే కావడం గమనార్హం. సర్పంచ్ పదవి కోసం ఎన్నికల బరిలో నిలిచి పోటీ పడటం కంటే.. ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందవచ్చనే ఆలోచనతోనే ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.
ప్రభుత్వ నజరానా.. మూడు శ్లాబులు
మరోవైపు పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం భారీ నజరానాలు ప్రకటించింది. ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 10 వేలలోపు జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీకి రూ.50 లక్షల చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. తద్వారా సాధ్యమైనంత వరకూ తమ కూటమి పార్టీలకు చెందిన ఆశావహులకు ఆయా పంచాయతీలు ఏకగ్రీవమయ్యేలా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో కూడా తమ హవా నడించిందని చెప్పుకొనేందుకే భారీ నజరానాలు ఇస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అభివృద్ధి చెందిన
పంచాయతీల పైనే గురి
జిల్లాలో ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న పంచాయతీల్లో పోరు రసవత్తరంగా మారుతోంది. రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట మండలం మాచవరం, రాజోలు మండలం తాటిపాక, రాజోలు, మలికిపురం, అమలాపురం మండలం బండారులంక, పేరూరు, కామనగరువు, రామచంద్రపురం మండలం ద్రాక్షారామ వంటి అభివృద్ధి చెందిన పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పంచాయతీ పీఠం దక్కించుకోవడాన్ని రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దీంతో, ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో అధికార కూటమి పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు.
కోటి.. రెండు కోట్ల ఖర్చు అంచనా
పేరున్న మేజర్ పంచాయతీల్లో ఎన్నికల ఖర్చు కూడా భారీగానే ఉంటుందనే అంచనాలున్నాయి. కొన్నిచోట్ల సర్పంచ్ ఎన్నికకు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంత భారీగా ఖర్చు చేసినా గెలుపుపై పూర్తి భరోసా ఉండటం లేదు. పైగా ఎన్నికల ప్రచారం పేరుతో ప్రయాసలు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకోవడం సులభమైన మార్గంగా కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వ నజరానా, ఇటు వ్యక్తిగత ఆఫర్లు కలిపి పంచాయతీని తమ ఖాతాలో వేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివలన ఎన్నికల టెన్షన్ నుంచి ముందే బయట పడవచ్చనే ఆలోచనతో కూడా ఉన్నారు. సర్పంచ్ పదవుల కోసం ఈవిధంగా భారీ మొత్తాలు ఆఫర్ చేయడం, ప్రత్యర్థులను తప్పించేందుకు ఆర్థిక ప్రలోభాలు చూపుతున్నారనే ప్రచారం ప్రజాస్వామికవాదులకు ఆందోళన కలిగిస్తోంది. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా జరగాల్సిన ఈ ఎన్నికలు ఆర్థిక బలప్రదర్శనగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో
ఏకగ్రీవాల మాటున ప్రోత్సాహకాల ఎర
రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సర్కారు ప్రకటన
మరో అడుగు ముందుకేస్తున్న
టీడీపీ ఆశావహులు
రూ.50 లక్షల నుంచి
రూ.కోటి వరకు భారీ ఆఫర్లు
ఏకగ్రీవాల మాటున భారీగా బేరసారాలు
అధిక పంచాయతీలు కొట్టేసేందుకు కూటమి యత్నం


