సాక్షి, అమలాపురం: రబీ సాగుకు రైతులు సిద్ధం కావాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. గోదావరి డెల్టా పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో రబీ సాగు సన్నద్ధత, కాలువల నిర్వహణ, డ్రైనేజీ సమస్యలపై ఆయన సమీక్షించారు.
అవసరం 104 టీఎంసీలు..
లభ్యత 88 టీఎంసీలు
గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో 8,96,507 ఎకరాలకు సాగునీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు సుమారు 104 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 88 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వంతులవారీ సరఫరా చేపట్టి, చివరి భూముల వరకు నీరందించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. రైతులు ముందస్తు ప్రణాళికతో నాట్లు వేసేలా వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,23,837 ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు.
కాలువల్లో పూడికలు తొలగించాలి
కాలువల్లో అడ్డంకులు, పూడికలు, ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన పంట కాలువల్లో పడిపోయిన భారీ వృక్షాలను తక్షణం తొలగించాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పని చేసి, డిసెంబర్ మొదటి వారంలోగా నిర్దేశిత పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని 44 తాగునీటి చెరువుల్లో ప్రస్తుతం 50 శాతం నీరు మాత్రమే ఉందని, వాటిని పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రైతులకు డిజిటల్ గుర్తింపు
అగ్రి స్టాక్ ద్వారా ప్రతి రైతుకూ 11 అంకెల ప్రత్యేక ఫార్మర్ ఐడీ అందించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 297 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 1.43 లక్షల మంది రైతులకు ఐడీలు సృష్టించామని వెల్లడించారు. మిగిలిన రైతులనూ వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. భూములు, పంటలు, సాగు వివరాలను ఒకే డిజిటల్ గుర్తింపుతో అనుసంధానించి, ప్రభుత్వ వ్యవసాయ సేవలను పారదర్శకంగా అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించారు. సమావేశంలో తూర్పు, మధ్య డెల్టాల ప్రాజెక్టు కమిటీల చైర్మన్లు సునీల్ కుమార్, గుబ్బల శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జేడీ ఎం.రామారావు పాల్గొన్నారు.
చివరి ఆయకట్టు వరకు
నీరందించేందుకు కార్యాచరణ
డిసెంబర్ మొదటి వారంలోగా కాలువలు, డ్రైనేజీల మరమ్మతుల పూర్తి
ఐఏబీ సమావేశంలో కలెక్టర్
మహేష్ కుమార్ ఆదేశాలు


