సాక్షి, అమలాపురం: అర్నబ్, మురసు తుపాన్లు వరుసగా ముంచెత్తాయి. పంట నేలకొరిగింది. ధాన్యం తడిసి ముద్దయింది. అయినప్పటికీ వ్యవసాయ అధికారులు చేపట్టిన పంట కోత ప్రయోగాల్లో దిగుబడి మాత్రం పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపంతో తీవ్రంగా నష్టపోయిన కోనసీమ రైతులకు ఇప్పుడు పంట కోత ప్రయోగాలు (క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ – సీసీఈ) మరో గండంగా మారుతున్నాయి.
86 శాతం వరి పంటకు నష్టం
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 1,25,640 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వారం రోజుల వ్యవధిలో విరుచుకుపడిన వరుస తుపాన్ల ధాటికి ఏకంగా 1,08,324 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బ తిన్నట్లు తుది నష్టం అంచనాల్లో తేలింది. దీని ప్రకారం సాగు విస్తీర్ణంలో సుమారు 86 శాతం పంట తుడిచిపెట్టుకుపోయింది. వరి కంకులు నేలకు ఒరిగిపోవడం, నీటిలో నానిపోవడం, ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరిగ్గా ఇదే సమయంలో రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం, నర్సాపురపుపేట ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు పంట కోత ప్రయోగాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎకరానికి 21 నుంచి 23 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నీటిలో నానిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండటంతో బరువు పెరుగుతుంది. దీంతో, ప్రయోగాల్లో నమోదయ్యే దిగుబడి వాస్తవ దిగుబడికి భిన్నంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇవే లెక్కల ఆధారంగా దిగుబడులు ఖరారు చేస్తే పంట నష్టం తీవ్రత తగ్గినట్లు లెక్కల్లో కనిపిస్తుందని, దీనివలన బీమా పరిహారం అందకుండా పోతుందని, ఈ ప్రయోగాలు తమ పరిహారానికి కోత పెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.
అన్నదాత కొంపముంచేలా..
అర్నబ్ తుపానుతో నేలనంటిన వరి
నీట మునిగిన చేలు
ఈ సమయంలోనే పంట కోత ప్రయోగాలు చేపట్టిన అధికారులు
తడిసిన ధాన్యంతో పెరిగిన బరువు
దిగుబడి అంచనాల్లోనూ పెరుగుదల
ఇవే లెక్కలు ఖరారైతే
బీమాకు కోత తప్పదని రైతుల ఆందోళన
పంట కోతల తర్వాతే ప్రయోగాలు చేయాలి
ప్రస్తుత పరిస్థితుల్లో పంట కోత ప్రయోగాలు నిర్వహించడం వల్ల రైతులకు అన్యాయం జరిగే ప్రమాదముంది. చేలల్లో నీరు నిలిచిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. ఇప్పుడు పంట కోత ప్రయోగాలు చేస్తే తేమ ఉన్న ధాన్యం బరువు ఎక్కువగా వస్తుంది. తద్వారా దిగుబడి బాగానే వచ్చినట్లు లెక్కలు చూపిస్తే రైతులకు బీమా పరిహారం ఎలా వస్తుంది? వరి కోతలు పూర్తయి, ధాన్యంలోని తేమ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ప్రయోగాలు నిర్వహించాలి. క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని దిగుబడి అంచనాలు రూపొందించాలి.
– కొవ్వూరి త్రినాథరెడ్డి, వైఎస్సార్ సీపీ
రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బీమా పరిధిలోనూ అరకొరే
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేయడంతో సాగు చేసిన ప్రతి ఎకరాకూ బీమా రక్షణ ఉండేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానాన్ని కొనసాగించకపోవడంతో రైతులే బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇది భారం కావడంతో చాలా మంది బీమాకు దూరమయ్యారు. ప్రధానంగా పంట సాగుదారు హక్కు (సీసీఆర్) కార్డులు పెద్దగా లేని కౌలుదారులు బీమా పొందలేక మొత్తం నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా 58,763 ఎకరాలు మాత్రమే బీమా పరిధిలో ఉంది. మిగిలిన రైతులకు బీమా భరోసా కూడా లేదు. ఇప్పటికే గత ఏడాది వచ్చిన మోంథా తుపానుకు నష్టపోయిన రైతుల్లో చాలా మందికి పెట్టుబడి రాయితీ అందలేదు. గత నెల, ఈ నెలలో వచ్చిన వరుస తుపాన్లకు దెబ్బతిన్న పంటకు చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ఎప్పుడిస్తుందనే స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో బీమా పరిహారం కూడా కుదించుకుపోతే తమ గతేం కావాలని రైతులు వాపోతున్నారు.


