కొబ్బరి రైతులకు
మరో గండం
కోనసీమకు ప్రధాన జీవనాధారమైన కొబ్బరి సాగుపైనా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో 1.64 లక్షల కొబ్బరి చెట్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. వీటికి చెట్టుకు రూ.1,500 చొప్పున రూ.24.70 కోట్లు నష్టపోయారు. ఒక్కసారి చెట్టు నేలకొరిగితే దాని స్థానంలో మరో చెట్టు పెరిగి దిగుబడి ఇచ్చేందుకు ఏళ్ల సమయం పడుతుంది. దీంతో, తక్షణ ఆదాయమే కాకుండా భవిష్యత్తులో వచ్చే దిగుబడిపైనా రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మొవ్వు విరిగి దెబ్బతిన్న చెట్లు కూడా అపారంగా ఉన్నాయి.
ఎటుచూసినా పచ్చని తివాచీ పరిచినట్లుగా ఉండే కోనసీమ వరుస తుపాన్లు మిగిల్చిన నష్టంతో విలవిలలాడుతోంది. నిన్న మొన్నటి వరకూ జిల్లావ్యాప్తంగా కళకళలాడిన కొబ్బరి, అరటి, ఇతర పండ్ల తోటలు అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సానికి దారుణంగా దెబ్బ తిన్నాయి. భీకర గాలులకు నిలువెత్తు కొబ్బరి చెట్లు చూస్తుండగానే నేలకొరిగిపోయాయి. కొన్నింటికి మొవ్వు విరిగిపోయాయి. పెను గాలుల తాకిడికి అరటి తోటలు వెన్ను విరిగి నేలకూలిపోయాయి. ఇతర ఉద్యాన పంటలకూ తీరని నష్టం వాటిల్లింది. సుడులు తిరుగుతూ విరుచుకుపడిన ప్రళయ మారుతం తోటలను మాత్రమే కాదు.. రైతుల ఆశల్ని కూడా కూకటివేళ్లతో సహా పెకలించేశాయి.
సాక్షి, అమలాపురం: అర్నబ్ తుపాను కోనసీమ ఉద్యాన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఏళ్ల తరబడి పెంచుకున్న తోటలు కళ్లముందే నేలకొరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంట చేతికొచ్చే సమయంలో వీచిన బలమైన గాలులు, కురిసిన భారీ వర్షాలు అరటి తోటలను నేలమట్టం చేశాయి. కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. బొప్పాయి, కూరగాయలు, తమలపాకు, మామిడి తోటలు దెబ్బతిన్నాయి.
ఉద్యాన శాఖ చేపట్టిన ప్రాథమిక నష్టం అంచనాల్లో జిల్లాలో రూ.54.08 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తేలింది. మొత్తం 23,398 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా, 52,028 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొబ్బరి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. 1.64 లక్షల కొబ్బరి చెట్లు ధ్వంసమవడంతో వీటి నష్టమే రూ.24.70 కోట్లుగా అంచనా వేశారు. ఇతర ఉద్యాన పంటలకు మరో రూ.29.30 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో నష్టం తీవ్రత అధికంగా ఉంది. పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకునేందుకు పడిన శ్రమంతా ఒక్క తుపాను దెబ్బకు నేలకొరగడం రైతులకు అంతులేని ఆవేదనను మిగిల్చింది.
ఇతర పంటలకూ నష్టం
ఇతర పంటలను పరిశీలిస్తే.. 2,524 మంది రైతులకు చెందిన కూరగాయల పంటలు 2,228 ఎకరాల విస్తీర్ణంలో దెబ్బ తిన్నాయి. వీరికి రూ.2.25 కోట్ల సాయం అవసరమని అధికారులు అంచనా వేశారు. బొప్పాయి 189 ఎకరాలు, తమలపాకు 128 ఎకరాలు, మామిడి 145 ఎకరాలు, పూల తోటలు 72 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. పసుపు పది ఎకరాలు, జామకు 2.5 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.
సాయం కోసం ఎదురుచూపులు:
ఒకవైపు పంట నష్టం.. మరోవైపు అప్పుల భారం.. ఇంకోవైపు దెబ్బతిన్న తోటలను తిరిగి బాగు చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడి.. ఇలా ఉద్యాన రైతులు సతమతమవుతున్నారు. వరి రైతులకే నష్టపరిహారం అందని పరిస్థితుల్లో ఉద్యాన పంటలకు ఎప్పుడు పరిహారం వస్తుందోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పంట నష్టాన్ని లెక్కించడంతో సరిపెట్టకుండా ప్రభుత్వం వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొబ్బరికి అపార నష్టం
ధ్వంసమైన కొబ్బరి చెట్లు 1,64,671
ఒక్కో చెట్టుకు పరిహారం రూ.1,500
మొత్తం పరిహారం రూ.24,70,06,500
బాధిత రైతులు 31,446
అరటికి కోలుకోలేని దెబ్బ
తుపాను ప్రభావం అత్యధికంగా అరటి రైతులపై పడింది. జిల్లావ్యాప్తంగా 18,481 ఎకరాల్లో అరటి పంట దెబ్బతినగా, 17,246 మంది రైతులు నష్టపోయారు. ఒక్క అరటి పంటకే రూ.26.17 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) అవసరమని అధికారులు అంచనా వేశారు. బలమైన గాలులకు గెలలు వేసిన దశలో ఉన్న తోటలు నేలవాలడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. మరికొన్నిచోట్ల గెలలు దెబ్బతిని మార్కెట్‌కు తరలించే పరిస్థితి లేకుండా పోయింది. అప్పులు చేసి తోటలను పెంచిన రైతులకు ఇప్పుడు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
కొత్తపేటలో తుపాను గాలులకు విరిగి పడిన అరటి తోట (ఫైల్)
జిల్లాలో ఉద్యాన పంటల నష్టం వివరాలు
పంట దెబ్బ తిన్న ఇన్‌పుట్ బాధిత
తోటల విస్తీర్ణం సబ్సిడీ రైతులు
(ఎకరాలు) (రూ.)
అరటి 18,481 26,17,70,271 17,246
కూరగాయలు 2,228 2,25,43,900 2,524
బొప్పాయి 189 19,16,500 203
తమలపాకు 128 38,82,660 231
మామిడి 145 20,53,555 264
పసుపు 10 1,45,600 7
జామ 2.47 35,000 1
పూలు 72 7,27,800 106
వెన్ను విరిగిన ఉద్యానం
వరుస తుపాన్లతో జిల్లాలో
రూ.54 కోట్ల నష్టం
23,398 ఎకరాల్లో దెబ్బ తిన్న తోటలు
1.64 లక్షల కొబ్బరి చెట్లు ధ్వంసం
కొత్తపేట, పి.గన్నవరంలో
అత్యధికంగా చేటు


