● ఆత్రేయపురంలో ముందుకు
సాగని ఆలయాల నిర్మాణం
● రూ.2 కోట్లకు పైగా
విరాళాల సేకరించారు
● అర్చకుల ఇళ్లు కూల్చేశారు
● అయినా ముందుకు సాగని పనులు
● టీడీపీ నేత నిర్వాకంపై భక్తుల ఆగ్రహం
ఆత్రేయపురం: మూడున్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర కలిగిన ఆ సుప్రసిద్ధ ఆలయాలను పునర్నిర్మిస్తామన్నారు. కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. దేవదాయ శాఖ కూడా నిధులు ఇచ్చింది. హడావుడిగా పాత ఆలయాలను తొలగించేశారు. ఓ చిన్న షెడ్డు వేసి, అదే బాలాలయమంటూ మూలవిరాట్టులను అక్కడకు చేర్చారు. ఆలయాల పునర్నిర్మాణం పేరుతో అర్చకుల ఇళ్లను సూతం కూల్చేశారు. వారిని రోడ్డున పడేశారు. ఇదంతా జరిగి దాదాపు సంవత్సరం గడుస్తోంది. ఇప్పటికీ నూతన ఆలయాలకు ఒక్క ఇటుక కూడా వేయలేదు. దీనంతటికీ మూలకారకుడైన స్థానిక టీడీపీ నేత నిర్వాకంపై భక్తులు మండిపడుతున్నారు. వివరాలివీ..
పురాతన చరిత్ర
ఆత్రేయపురంలో సుమారు 350 సంవత్సరాలకు పూర్వం నుంచి శివకేశవుల ఆలయాలున్నాయి. బాలాత్రిపురసుందరీ సమేత రాజరాజేశ్వర స్వామి, రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివార్లు ఇక్కడ కొలువుదీరి, భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వయంగా అత్రి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, ఇక్కడి స్వామివార్లకు పూజలు చేశారని భక్తులు చెబుతారు. అందువల్లనే ఆ మహర్షి పేరిట ఈ ఊరికి ఆత్రేయపురం అనే పేరు వచ్చిందన్నది కథనం.
విరాళాలు సేకరించి.. గుడిని కూల్చి
అంతటి ప్రసిద్ధి చెందిన ఇక్కడి శివకేశవుల పురాతన ఆలయాలను పునర్మించాలని స్థానిక టీడీపీ నేత ఒకరు తలపెట్టారు. దీనికోసం కమిటీలు సైతం ఏర్పాటు చేయించారు. గ్రామానికి చెందిన పలువురు దాతలు ఈ ఆలయాల పునర్నిర్మాణానికి రూ.2 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు. తద్వారా కామన్ గుడ్ ఫండ్ చెల్లించడంతో దేవదాయ శాఖ కూడా మరో రూ.2 కోట్లు ఇచ్చింది. పాత ఆలయాలను పది నెలల కిందట కూల్చేశారు. ఆలయం చుట్టూ ఉన్న అర్చకుల ఇళ్లను సైతం ఆ టీడీపీ నేత, ఆలయాల చైర్మన్లు భారీ యంత్రాల సాయంతో దౌర్జన్యంగా కూల్చేశారు. స్వామివార్లనే నమ్ముకుని జీవిస్తున్న అర్చకులను రోడ్డుపైకి నెట్టేశారు. రావిచెట్టు సెంటర్‌లో బాలాలయం పేరుతో ఓ షెడ్డు వేసి, స్వామివార్ల మూలవిరాట్టులను అక్కడకు చేర్చారు. ప్రజలందరినీ చల్లగా చూసే స్వామివారికే నీడ కరువవడం.. బాలాలయం సరిగ్గా లేకపోవడంతో అక్కడ పూజలు, ఇతర కై ంకర్యాలు కష్టంగా మారాయి. నైవేద్యాలను ఎక్కడో వండి బాలాలయానికి తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు పాత ఆలయాలను తొలగించిన చోట ఆదరాబాదరాగా గోతులు తవ్వి, శంకుస్థాపన చేశారు. అక్కడితో సరి.. దాదాపు ఏడాదవుతున్నా ఇప్పటి వరకు ఆలయాల పునర్నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోతులు నీటితో నిండిపోయాయి.
కార్తికంలోనూ పూజలు కరువు
ఈ పనుల తీరుపై భక్తులు, దాతలు, గ్రామస్తులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కార్తిక మాసంలోనైనా స్వామివార్లకు భక్తితో పూజలు, అభిషేకాలు చేసుకోవచ్చని ఆశ పడిన తమకు నిరాశే మిగిలిందని మండిపడుతున్నారు. చుట్టూ ప్రహరీ లేకపోగా, రక్షణగా కంచె కూడా లేకపోవడంతో ఆలయ స్థలం పవిత్రతకు భంగం వాటిల్లుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక టీడీపీ నేత గుడులు, బడులను రాజకీయానికి వాడుకుంటూ ఆలయాల చైర్మన్‌తో పార్టీ ప్రచారం చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికై నా పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయో లేదోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గుడుల నిర్మాణం చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు, భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.


