ఆత్రేయపురం: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి హుండీల ద్వారా 49 రోజులకు రూ.2,91,06,115 ఆదాయం లభించింది. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీల ఆదాయాన్ని జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.లక్ష్మీనారాయణశెట్టి, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈఓ పీవీవీఎస్ కామేశ్వరరావుల గురువారం సమక్షంలో లెక్కించామని వివరించారు. విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీలతో కలిపి ప్రధాన హుండీల ద్వారా రూ.2,42,49,560, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.48,56,555 లభించాయని తెలిపారు. అలాగే, బంగారం 39.500 గ్రాములు, వెండి 1.607 కిలోలు, 16 దేశాలకు చెందిన 136 కరెన్సీ నోట్లు లభించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ హుండీ ఆదాయం
రూ.37.48 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మొత్తం 72 రోజులకు హుండీల ద్వారా రూ.36,48,325 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. ఎండోమెంట్స్ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మొల్లేటి చక్రపాణి, పలువురు సేవకులు పాల్గొన్నారు.
బయోచార్‌తో
మహిళలకు ఉపాధి
అమలాపురం రూరల్: కొబ్బరి వ్యర్థాలను సంపదగా మార్చే బయోచార్, పైరోలసిస్ సాంకేతికత ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు సరికొత్త స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. బయోచార్, కొబ్బరి వ్యర్థాల ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఉపాధి అవకాశాల విస్తరణపై మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయినవిల్లి మండలం నేదునూరులోని కృషీవల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంస్థను సందర్శించి, బయోచార్ తయారీ, కొబ్బరి వ్యర్థాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ గురించి తెలుసుకున్నానని చెప్పారు. ఈ వినూత్న విధానాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను గణనీయంగా విస్తరించవచ్చని చెప్పారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రలోభాల ‘పంచాయితీ’
అమలాపురం రూరల్ : ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు అంతులేని అక్రమాలకు, అరాచకాలకు పాల్పడిన విషయాన్ని యావద్దేశం కళ్లారా చూసింది. ఆ ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓటుకు రూ.500 నుంచి ఏకంగా రూ.5 వేల వరకూ కూడా కూటమి నేతలు ఎర వేసి, ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ఈ చీడ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు కూడా అంటుకున్నట్టుంది. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో.. సర్పంచ్ పదవులకు రేసులో ఉన్న వారు గ్రామాభివృద్ధికి విరాళం పేరుతో ఏకంగా రూ.లక్షలు, రూ.కోట్లలో ఎర వేస్తున్నారు. అమలాపురం మండలం పేరూరుకు చెందిన ఓ టీడీపీ మద్దతుదారు తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు అందజేస్తానని గురువారం ప్రకటించారు. ఇక బండారులంకకు చెందిన టీడీపీ యువనేత ఒకరైతే ఏకంగా కోటి రూపాయల సమకూర్చడానికి సిద్ధమని చెప్పారు. వారి తీరుపై ప్రజాస్వామికవాదులు నివ్వెరపోతున్నారు.


