నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

● ప్రతి దశనూ వీడియో తీయించాలి

● సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

● కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌,

ఎస్పీ రాహుల్‌ మీనా

అమలాపురం రూరల్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లోని నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటర్నింగ్‌ అధికారులు, ఇతర సిబ్బందికి స్టేజ్‌–1, స్టేజ్‌–2 శిక్షణలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. శిక్షణకు హాజరు కాని సిబ్బందికి మరో అవకాశం కల్పించాలని సూచించారు. పది వేల కంటే తక్కువ జనాభా ఉన్న రెండు నుంచి నాలుగు చిన్న గ్రామ పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, అందులోని ప్రధాన పంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. పది వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ప్రత్యేక రిటర్నింగ్‌ అధికారులను నియమించాలని చెప్పారు. నామినేషన్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలు లేదా వీడియోగ్రఫీ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. సంబంధిత ఫుటేజీని 60 రోజుల పాటు లేదా ఎన్నికల పిటిషన్లు పరిష్కారమయ్యేంత వరకూ భద్రపరచాలని ఆదేశించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్‌ చేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలకు ఎక్కడా అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్‌ కేంద్రాలకు అభ్యర్థులు సురక్షితంగా చేరుకునేందుకు రూట్‌ బందోబస్తు ఏర్పాటుతో పాటు మొబైల్‌ పోలీసు పార్టీల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్‌ చెప్పారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఎస్పీ రాహుల్‌ మీనా తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికలు స్థానికుల స్వచ్ఛంద నిర్ణయం, స్వేచ్ఛాయుత ఎంపిక ద్వారానే జరగాలని, ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, బలవంతపు చర్యలకు తావుండకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు సీపీఓ ఎం.మురళీకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి కె.శాంతిలక్ష్మి, జిల్లా పరిపాలన అధికారి కె.నాగలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement