● నేడే ‘పరిషత్’ ఫలితాలు
● పల్లెల్లో అంతటా ఉత్కంఠ
● 19 మండలాల్లో 66.27 శాతం
ఓటింగ్ నమోదు
● జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో కౌంటింగ్
● 369 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు..
ఏర్పాట్లు పూర్తి
సాక్షి, అమలాపురం: పల్లె పోరులో గెలుపెవరిది? ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? అనే ఉత్కంఠకు శనివారం తెర పడనుంది. కోనసీమ జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఈ మేరకు కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపాన్లు ఎన్నికల ప్రచారం, పోలింగ్‌పై ప్రభావం చూపడంతో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఈ తగ్గుదల ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
జిల్లాలోని 19 మండలాల్లో మొత్తం 10,90,975 మంది ఓటర్లకు గాను సుమారు 7.23 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 66.27 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం రాజకీయ పార్టీలను ఆలోచనలో పడేసింది. పోలింగ్ అత్యధికంగా ఆలమూరులో 72.29 శాతం, అత్యల్పంగా కాట్రేనికోనలో 58.72 శాతమే నమోదైంది.
అమలాపురం డివిజన్‌కు ఎస్‌కేబీఆర్..
పరిషత్ ఓట్ల లెక్కింపునకు జిల్లాలోని 19 మండలాలకు సంబంధించి మూడు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలో మొత్తం 379 ఎంపీటీసీ స్థానాలకు గాను 369 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. మూడు డివిజన్ల పరిధిలోని 19 మండలాలకు ఈ కౌంటింగ్ కేంద్రాలను కేటాయించారు. అమలాపురం డివిజన్‌లో పది మండలాల ఓట్ల లెక్కింపు అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కళాశాలలో జరుగనుంది. ఇక్కడ 196 ఎంపీటీసీ స్థానాలకు 195 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మండలాల వారీగా.. అమలాపురానికి 25, ఉప్పలగుప్తానికి 16, అల్లవరానికి 19, ముమ్మిడివరానికి 12, ఐ.పోలవరానికి 19, కాట్రేనికోనకు 21, మలికిపురానికి 22, సఖినేటిపల్లికి 21, మామిడికుదురుకు 20, రాజోలుకు 20 టేబుళ్లు కేటాయించారు. కళాశాలలోని జువాలజీ, కామర్స్, డీఎడ్, బీఎడ్, ఎన్‌సీసీ బ్లాక్‌లు, బాలికల హాస్టల్ తదితర ప్రదేశాల్లో ఆయా మండలాలకు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు.
కొత్తపేట డివిజన్‌లో రెండు కేంద్రాలు
కొత్తపేట డివిజన్‌లో ఏడు మండలాలకు రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ డివిజన్‌లో 145 ఎంపీటీసీ స్థానాలకు 136 టేబుళ్లు కేటాయించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రావులపాలెం మండలానికి 24, కొత్తపేటకు 22, ఆత్రేయపురానికి 19, ఆలమూరుకు 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పి.గన్నవరానికి 22, అయినవిల్లికి 14, అంబాజీపేటకు 14 టేబుళ్లు కేటాయించారు. అంబాజీపేట మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు 14 టేబుళ్లతోనే లెక్కింపు నిర్వహించనున్నారు.
రామచంద్రపురంలో 38 టేబుళ్లు
రామచంద్రపురం డివిజన్‌లో రెండు మండలాలకు ఎస్‌కేపీజీఎన్ జూనియర్ కళాశాలను కౌంటింగ్ కేంద్రంగా నిర్ణయించారు. ఈ డివిజన్‌లో 38 ఎంపీటీసీ స్థానాలకు 38 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం మండలానికి 20, కె.గంగవరం మండలానికి 18 టేబుళ్లు కేటాయించారు. ఈ రెండు మండలాల కౌంటింగ్ కూడా ఆయా కేటాయించిన హాళ్లలోనే జరగనుంది.
జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు అక్కడే..
ఎంపీటీసీ ఎన్నికలతో పాటు ఆయా మండలాల పరిధిలోని జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును కూడా ఇదే కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఎంపీటీసీ ఓట్లు లెక్కపెట్టే బ్లాక్‌లోనే మరో రూమ్‌లో జెడ్పీటీసీ ఓట్లు లెక్కించనున్నారు. అయితే ఎంపీటీసీ ఓట్లు లెక్కింపు పూర్తయిన తరువాత జెడ్పీటీసీ ఓట్లు లెక్క తేలనుంది. తొలుత బాక్సులు తెరిచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను వేరు చేయనున్నారు. తరువాత వాటిని కట్టలుగా కడతారు. అనంతరం లెక్కిస్తారు.
ట్రాఫిక్ మళ్లింపు
అమలాపురం టౌన్: స్థానిక ఎస్‌కేబీఆర్ కళాశాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంగా కేటాయించారు. ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం మొదలవుతున్న క్రమంలో పట్టణంలో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు శనివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అమలులో ఉంటాయని చెప్పారు. అమలాపురం ఈదరపల్లి వంతెన నుంచి రాజోలు వైపు వెళ్లే వాహనాలు నల్లవంతెన, ఎర్ర వంతెన, కిమ్స్ వైద్య కళాశాల (216 జాతీయ రహదారి), భట్నవిల్లి వై.జంక్షన్ మీదుగా వెళ్లాలి. రాజోలు వైపు నుంచి రావులపాలెం లేదా అయినవిల్లి వెళ్లే వాహనాలు పేరూరు వై.జంక్షన్, భట్నవిల్లి వై.జంక్షన్, కిమ్స్ వైద్య కళాశాల, ఎర్ర వంతెన, నల్ల వంతెన మీదుగా వెళ్లాలని సీఐ వివరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎస్‌కేబీఆర్ కళాశాల తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం వల్ల ప్రయాణికులు ఆయా మార్గాల మీదుగా ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రయాణించాలని సూచించారు.
అమలాపురం డివిజన్ : 195 టేబుళ్లు
కొత్తపేట డివిజన్ : 136 టేబుళ్లు
రామచంద్రపురం డివిజన్ : 38 టేబుళ్లు


