మామిడికుదురు: గాఢాంధకారంలో మగ్గుతున్నాం.. గాలాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం.. దోమల రోత ఆపై చీకటితో అల్లాడుతున్నాం.. ఎన్నాళ్లీ చీకటి రోజులంటూ పాశర్లపూడిలంక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పది రోజులు గడుస్తున్నా, అధికారులు విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై వారు గురువారం రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కారు. పది రోజులుగా చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నామని, కరెంట్ లేక రాత్రి వేళల్లో నరకం చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు పనిచేయక తాగునీటికి, నిత్యావసర పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వాపోయారు. ఉక్కబోత, దోమకాట్లతో చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారని, పది రోజుల నుంచి తమకు నిద్ర కరవైందని కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు గ్రామాల్లో కరెంట్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు కొవ్వొత్తుల ధరలను విపరీతంగా పెంచేశారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ లేకపోతే ఫోన్ చేయండి
అమలాపురం రూరల్: అర్నబ్ తుపాను నేపథ్యంలో జిల్లాలో ఏ గ్రామానికైనా విద్యుత్ సరఫరా లేకపోతే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ రాజేశ్వరి సూచించారు. జిల్లా కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 94409 04477, 94408 14207, ఏపీఈపీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలన్నారు. విపత్తు సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
హుండీల ఆదాయం లెక్కింపు
పిఠాపురం: స్థానిక పాదగయ శ్రీరాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల ఆదాయం లెక్కింపును గురువారం నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి కేఎల్ సుధారాణి, కార్యనిర్వహణాధికారులు బీవీఆర్ చౌదరి, ఎం.వీరభద్రరావు పర్యవేక్షణలో చీఫ్ ఫెస్టివల్ అధికారి చాగంటి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు చేపట్టారు. 80 రోజులకు హుండీల ద్వారా రూ.26,76,188 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. 2026 ఆగస్టు 18 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 80 రోజుల వ్యవధిలో భక్తులు హుండీలలో సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.26,76,188 ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
సైన్ బోర్డులు ఏర్పాటు చేయండి
అన్నవరం: కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి సమాచారంతో కూడిన సైన్ బోర్డులను దేవస్థానంలో ఏర్పాటు చేయాలని దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘దారి చూపు స్వామీ ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దేవస్థానంలో పలుచోట్ల సైన్ బోర్డులు లేకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. అదే విధంగా పోలవరం కాలువ నిర్మాణం కోసం జాతీయ రహదారిపై బెండపూడి వద్ద ఇరువైపులా ఫ్‌లైఓవర్లు నిర్మించినందున గిరిప్రదక్షిణ పుష్కర కాలువ రోడ్డుకు వెళ్లేందుకు గాను ఈ సారి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు పలు సమస్యలను ‘సాక్షి’ ప్రస్తావించింది. వీటిపై కమిషనర్ స్పందించారు. ఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కూడలిలో సైన్ బోర్డులు ఉండాలని ఆదేశించారు. గిరిప్రదక్షిణ రోడ్డు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి రథం పుష్కర కాలువ రోడ్డులోకి వెళ్లేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


