అమలాపురం టౌన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లాలో ఏర్పాటైన అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట కౌంటింగ్ కేంద్రాల వద్ద శనివారం ఉదయం నుంచి ప్రత్యేక నిఘా, పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు వంటి చర్యలు చేపట్టామని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఈ మూడు కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్పీ మీనా శుక్రవారం రాత్రి అమలాపురంలో ఓ ప్రకటన విడుదల చేశారు. నిషేధాజ్ఞల ప్రకారం కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. ఎన్నికల అధికారులు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే లోపలకు అనుమతిస్తారని పేర్కొన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు నియామక పత్రాలు, గుర్తింపు కార్డులను విధిగా వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. నిషేధాజ్ఞలు ప్రకారం ఐదుగురికి మించి ఒకచోట గుమిగూడి ఉండరాదన్నారు. ఘర్షణలకు దారి తీసే చర్యలు, రెచ్చగొట్టే నినాదాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.


