● 17 వరకు గడువు
● తెలుగు విశ్వవిద్యాలయం వీసీ మునిరత్నం నాయుడు
రాజమహేంద్రవరం రూరల్: ప్రస్తుత విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ) ఆచార్య డి.మునిరత్నం నాయుడు తెలిపారు. బొమ్మూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని రాజమహేంద్రవరం, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాల్లో గతంలో నిర్వహించిన కోర్సులను ఈసారి కూడా యథాతథంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17వ తేదీలోగా సంబంధిత పీఠాధిపతి/ప్రిన్సిపాల్‌కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. రూ.300 ఆలస్య రుసుంతో ఈ నెల 22లోగా ‘కన్వీనర్, కేంద్ర ప్రవేశాల కమిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు, రాజమహేంద్రవరం–533124’ చిరునామాకు దరఖాస్తులు పంపాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు పూర్తి చేయాలని, కోర్సు ఫీజులు ఆన్‌లైన్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలకు www.teluguuniversityap.in వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు. ఇతర సమాచారానికి 94926 92389, 0883–2947005 నంబర్లలో సంప్రదించవచ్చని వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ముసుగు శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.


