మా భూమిని పక్క రైతులకు కలిపేశారు
రీ సర్వేలో నా అత్త పేరిట ఉన్న భూమిలో 24 సెంట్లు పక్క రైతులకు కలిపేశారు. ఈ సమస్యపై అధికారులకు ఐదుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గొల్లవిల్లి గ్రామంలో దస్తావేజులో 74 సెంట్లు ఉన్న భూమిని వీఆర్‌ఓ, సర్వేయర్ పక్క రైతులకు కలిపి సర్వే చేసి, మా భూమి 50 సెంట్లే ఉందని చెబుతున్నారు. ఈ భూమిలో పెంకుటిల్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇటీవల సంతకాలు ఫోర్జరీ చేసి, విద్యుత్ మీటర్లు తొలగించారు. మాకు న్యాయం చేయాలి.
– గణేశుడు రాంబాబు, రైతు నాయకుడు, పంచాల చెరువు, నేదునూరు, అయినవిల్లి మండలం
● పీజీఆర్‌ఎస్‌పై అర్జీదారుల అసంతృప్తి
● పదేపదే తిరగాల్సి వస్తోందని ఆవేదన
అమలాపురం రూరల్: సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పరిష్కరించడం లేదని, కానీ, పరిష్కరించినట్లు లేఖలపై సంతకాలు చేయించుకుంటున్నారని పలువురు అర్జీదారులు వాపోయారు. దీంతో, అవే సమస్యలపై అధికారులు చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, పట్టణ కేంద్రాల్లోని అధికారులు తమ గోడు పట్టించుకొనకపోవడంతో జిల్లా కేంద్రం కలెక్టరేట్‌కు వస్తున్నామని, ఇక్కడ అర్జీలు ఇస్తున్నా అదే తంతు కొనసాగుతుందోనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 251 మంది హాజరై, అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) వి.సుబ్బారావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ జి.మమ్మీ, డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబు అర్జీలు స్వీకరించారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 35 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 35 అర్జీలు వచ్చాయి. ఫిర్యాదీల నుంచి ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు.
మెడికల్ పింఛను ఇప్పించండి
పుట్టుకతోనే నేను దివ్యాంగుడిని. దివ్యాంగ పింఛను అందుతోంది. ఐదు నెలల క్రితం ఆపరేషన్ చేసి, రెండో కాలు తొలగించారు. నాకు ఏవిధమైన ఆదాయ వనరులూ లేవు. గతంలో కూలి పని చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఇప్పుడు మంచంపై పడి ఉంటున్నాను. నా దయనీయ పరిస్థితిని పరిశీలించి, మెడికల్ పెన్షన్ మంజూరు చేయాలి.
– కట్టా పాండురంగ, అవిడి, కొత్తపేట మండలం
మా భూమి మాకిప్పించండి
మా తండ్రి కర్రి భైరవస్వామికి 1973 భూ సంస్కరణల రీత్యా అల్లవరం మండలం కొమరగిరిపట్నం సీతారామపురంలో ప్రభుత్వ వశమైన భూముల నుంచి సర్వే నంబర్ 1072/120, 1074/ఎ, 1074/2ఎ1లో రెండెకరాల భూమికి 1979లో పట్టాలు మంజూరు చేశారు. ఆ తరువాత మా తండ్రి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గ్రామానికి చెందిన భూస్వామి ఆ భూములను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ప్రభుత్వ భూమిని సర్వే నంబర్ 1070–2బిలో 3.40 ఎకరాలు, 1074–2ఎ–4 సర్వే నంబర్‌లో 2.67 ఎకరాల భూమిని తనదిగా చెప్పుకొంటూ.. 3.40 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన బొమ్మిడి పల్లయ్యకు అనధికారికంగా విక్రయించాడు. 2.67 ఎకరాల్లో అంగాడి సత్యనారాయణకు ఒకటిన్నర ఎకరాలు అమ్మేశాడు. ఈ ప్రభుత్వ భూమిలో అనధికార చెరువులు తవ్వి, ఎటువంటి అనుమతులూ లేకుండా అక్రమ మార్గంలో విద్యుత్ కూడా పొందుతున్నాడు. నా తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమి కోసం పోరాడుతున్న నాకు రెండెకరాల భూమి అప్పగించాల్సి ఉండగా ఎకరం మాత్రమే ఇచ్చారు. నాకు చెందాల్సిన రెండెకరాల కోసం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా.. నా ఫిర్యాదు తప్పని, నా భూములు నదీపాతంలో కలిసిపోయాయని, ఆ భూములు సీతారామపురంలోని ఆక్రమణదారువేనని వీఆర్‌ఓ తప్పుడు నివేదిక ఇచ్చారు. పైగా, ఫిర్యాదీనైన నా సంతకం పెట్టించుకోకుండానే నేను గ్రామంలో ఉండటం లేదంటూ తప్పుడు నివేదిక ఇచ్చి, నా ఫిర్యాదును మూసివేశారు. ఈ నేపథ్యంలో మా పూర్వీకులకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని వారసుడినైన నాకు ఇప్పించాలి. అనధికారికంగా విక్రయించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. వీఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలి.
– కర్రి చిన్నయ్య, సీతారామపురం,
కొమరగిరిపట్నం, అల్లవరం మండలం


