ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తిబాబు
అమలాపురం టౌన్: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడటం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు అన్నారు. అమలాపురంలో సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. నిరసనకు అనుమతి లేదంటూ ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం వేలాదిగా విజయవాడ తరలి వెళ్లడం అభినందనీయమన్నారు. ఆందోళన చేపట్టిన సచివాలయ ఉద్యోగులకు భోజనం, నీళ్లు ఇవ్వకుండా, కాలకృత్యాలు కూడా తీర్చుకోనివ్వకుండా, 70 మందిపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వం కక్ష సాధింపునకు నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న ఉద్యోగులపై అమానుషంగా వ్యవహరించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం సర్కారుకు తగదని అన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నా వారు ఆగకుండా ఉద్యోగులు ముందుకు దూసుకువెళ్లారన్నారు. పోలీసులు ఈడ్చుకుని వెళ్లినా మహిళా ఉద్యోగులు ఆందోళన కొనసాగించడం చూస్తూంటే ఉద్యోగాల పరంగా వారెంత ఇబ్బంది పడుతున్నారో, వారి పట్ల ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోందని సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు ప్రభుత్వ
పెన్షనర్ల ధర్నా
అమలాపురం టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం జిల్లాలోని ప్రభుత్వ పెన్షనర్లు మంగళవారం ఉదయం ధర్నా చేయనున్నారు. స్థానిక ఏవీఆర్ నగర్‌లోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా సంఘం భవనం వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించనున్నారు. ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌సీహెచ్ కృష్ణమూర్తి, కేకేవీ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సవరణ చేయాలని, ఎనిమిదో కేంద్ర వేతన సంఘం టర్‌మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సవరించాలని డిమాండ్ చేశారు. మొత్తం 12 డిమాండ్లతో ఈ ధర్నా చేపడుతున్నామని తెలిపారు. పెన్షనర్లందరూ మంగళవారం ఉదయం 10 గంటల్లోగా అమలాపురంలోని జిల్లా పెన్షనర్ల కార్యాలయానికి చేరుకుని, ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
జెడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్
అమలాపురం రూరల్: కొత్తగా ఏర్పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజా పరిషత్(జెడ్పీ)కు తొలి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనను జెడ్పీ అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూలమొక్క అందజేసి అభినందనలు తెలిపారు. జెడ్పీ పరిధిలోని అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వారికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనా అధికారులు సూర్యప్రకాష్, చిక్కం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బోధనేతర భారం తగ్గించాలి
అల్లవరం: ఉపాధ్యాయులపై బోధనేతర భారం తగ్గించి, బోధనకే పరిమితం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గురుముర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లవరం మండలం సామంతకుర్రు ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగుల వేతన సవరణ కోసం పీఆర్‌సీని వెంటనే ఏర్పాటు చేసి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పరిపాలన, ఇతర బోధనేతర పనులకు సిబ్బందిని నియమించాలన్నారు. హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, సైకాలజీ తదితర అంశాలకు సంబంధించిన మెటీరియల్ తెలుగు మీడియంలో ఇస్తున్నారని, ఆయా సబ్జెక్టులకు మాతృభాషలోనే ఉండాలని గురుమూర్తి దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


