సీఈసీని తక్షణం తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీని తక్షణం తొలగించాలి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

అమలాపురం టౌన్‌: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని ప్రజా సంఘాలు, వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో సోమవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థను జ్ఞానేష్‌ కుమార్‌ భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్‌ మాట్లాడుతూ, సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మిగిలిన ఇద్దరు కమిషన్ల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరిట దాదాపు 13 కోట్ల ఓట్లు తొలగించారని మండిపడ్డారు. మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ, విపక్షాల అభ్యంతరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఓటర్ల హక్కులను కాలరాసిన జ్ఞానేష్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, సీపీఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, జిల్లా ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు తదితరులు మాట్లాడుతూ, ఎలక్షన్‌ కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుంచి కేంద్ర హోం మంత్రిని తొలగించి, ఆ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పౌర హక్కుల సంఘం నాయకులు అమలదాసు బాబూరావు, జిల్లెళ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement