● వాతావరణ మార్పుల ప్రభావం
● జిల్లాను కుదిపేస్తున్న జ్వరాలు
● ఆస్పత్రులకు పెరుగుతున్న రోగులు
జాగ్రత్తలు పాటించాలి
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కొంత మందికి జ్వర లక్షణాలతో ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు, జలుబు, దగ్గు, తలనొప్పి సహజంగా వస్తాయి. ఇలాంటి లక్షణాలు రాకుండా ఉండాలంటే వర్షంతో తడవడం, ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగడం వంటివి తక్షణం మానేయాలి. నాన్ వెజిటేరియన్ వంటకాలకు దూరంగా ఉండాలి. కొన్ని రోజులు కాచి చల్లార్చిన నీరు తాగితే జ్వర లక్షణాల నుంచి బయట పడతారు.
– డాక్టర్ కారెం రవితేజ, జనరల్ ఫిజీషియన్,
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం
జ్వరాలపై సర్వే జరుగుతోంది
వాతావరణ మార్పుల వల్ల జిల్లాలో వస్తున్న జ్వరాలపై ప్రతి మండలంలోనూ ఆయా పీహెచ్‌సీల సిబ్బంది సర్వే చేస్తున్నారు. జ్వరం సోకిన వ్యక్తికి అక్కడికక్కడే రక్త పరీక్షలు చేస్తున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సిఫారసు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జ్వర పీడితులకు వైద్యం అందుతోంది. మలేరియా తదితర బాధితులుంటే ప్రత్యేక వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.
– డాక్టర్ కేఎన్ శ్రీనివాస్,
జిల్లా మలేరియా అధికారి, అమలాపురం
అమలాపురం టౌన్: విపరీతమైన ఎండలు.. అంతలోనే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు.. మళ్లీ చుర్రుమంటున్న సూరీడు.. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో జిల్లాపై జ్వరాలు పంజా విసురుతున్నాయి. చాలా కుటుంబాల్లో కనీసం ఒకరైనా జలుబు, దగ్గు, జ్వరాలతో బాధ పడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాది మంది జ్వరాలతో అవస్థలు పడుతున్నట్టు సమాచారం. ఒళ్లు కాలిపోతున్నట్టుగా జ్వరం, కళ్ల నుంచి నీరు కారడం, జలుబు, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు అనేక మందిలో కనిపిస్తున్నాయి.
జిల్లాలో రెండు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, 9 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉన్నాయి. ఇవి కాకుండా 150 వరకూ ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ప్రతి ఆస్పత్రికీ జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ అవుట్ పేషెంట్లుగా ఆస్పత్రులకు వచ్చి, చూపించుకుంటున్న వారి సంఖ్య మరీ అధికంగా ఉంటోందని అంటున్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు రోజుకు 20 నుంచి 30 మంది వివిధ జ్వర లక్షణాలతో వస్తున్నారు. సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు కూడా 10 మంది వరకూ జ్వర పీడితులు వస్తున్నారు. దాదాపు ప్రతి ప్రైవేటు ఆసుపత్రికి ఆరుగురు వరకూ వస్తున్నట్లు చెబుతున్నారు.
డెంగీ, మలేరియా వ్యాప్తి!
జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర జ్వరాలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. వైద్యులు చెబుతున్న సమాచారం ప్రకారం జిల్లాలో డెంగీ, మలేరియా జ్వరాలతో బాధ పడుతున్న వారు 12 మంది ఉన్నారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ డెంగీ జ్వరంతో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఓవైపు, ఫైలేరియా విభాగం సిబ్బంది మరోవైపు గ్రామాల్లో ఇంటింటా జ్వరాల సర్వేలు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఫీవర్ సర్వే ముమ్మరంగా జరుగుతోంది. ఇటీవల తీవ్ర వాయుగుండం వల్ల కురిసిన భారీ వర్షాల్లో కొందరు తడిశారు. వాయుగుండం తీరం దాటిన వెంటనే తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పుల వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, ముమ్మిడివరం తదితర మండలాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు.


