● నీట మునిగిన కనకాయలంక కాజ్‌వే
● పడవలపై లంకవాసుల రాకపోకలు
సాక్షి, అమలాపురం: గోదావరి వరద ఉధృతి జిల్లాలో మరింత పెరిగింది. ఎగువన భద్రాచలం, శబరి నదుల వద్ద వరద శాంతిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మధ్యాహ్నం నుంచి వరద నిలకడగా ఉంది. కానీ, దిగువున ఉన్న జిల్లాలో మాత్రం ముంపు తీవ్రత పెరుగుతోంది. జిల్లాలోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయల్లో వరద పెరిగింది. బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం 6 గంటలకు 9,66,322 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఇది మధ్యాహ్నం 11 గంటలకు 9,69,911 క్యూసెక్కులకు పెరిగింది. వరద ప్రభావం పి.గన్నవరం మండలంపై అధికంగా ఉంది. ఇక్కడ గంటి పెదపూడిలంక, అరిగెలవారిపాలెం, ఊడిమూడిలంక, బూరుగులంకలకు ఇప్పటికే పడవల మీద రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక కాజ్‌వే నీట మునిగింది. దీంతో, అక్కడి ప్రజలు కూడా పడవల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి – అయినవిల్లి లంక నడుమ కాజ్‌వేపై వరద ఉధృతి పెరిగింది. దీంతో, లంక గ్రామాలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. అక్కడి ప్రజల రాకపోకల కోసం పడవలు ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం, మామిడికుదురు మండలాల్లోని లోతట్టు లంక పొలాలు, కొబ్బరి తోటల్లో వరద నీరు చేరింది. పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాలపై దృష్టి సారించింది. కోటిపల్లి – ముక్తేశ్వరం రేవు ప్రయాణాలు గతం నుంచే ఆగిపోగా, తాజాగా సఖినేటిపల్లి – నర్సాపురం రేవు ప్రయాణాలను కూడా నిలిపివేశారు. కాగా, ఎగువన ధవళేశ్వరం వద్ద సోమవారం రాత్రి 10 గంటల నుంచి గోదావరి వరద తగ్గుముఖం పడుతోంది.


