ముమ్మిడివరం/కొత్తపేట: తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండుతో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా వారు సోమవారం ముమ్మిడివరంలో తహసీల్దార్ కార్యాలయం, కొత్తపేటలో పాత తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. పదమూడు రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేస్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలుగా ఉన్న వారిని రెగ్యులర్ చేయాలని, డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముమ్మిడివరంలో జరిగిన నిరసనలో రామేశ్వరపు శ్రీనివాసరావు, మాగాపు రాము, గోదాశి సత్యనారాయణ, మంగా నాగయ్య, ఎ.లక్ష్మి తదితరులు.. కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు కె.భీమశంకరం, ప్రధాన కార్యదర్శి పిల్లంగోరు బాలు, కోశాధికారి ఎస్.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


