సాక్షి, అమలాపురం: కోనసీమలో జిల్లా పరిషత్ కార్యకలాపాలు శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొనసాగిన పరిపాలనకు తెరపడి సొంత జిల్లా పరిషత్ ఏర్పాటుతో స్థానిక పాలనకు కొత్త అధ్యాయం మొదలైంది. అమలాపురం మండల పరిషత్ కార్యాలయం పైభాగంలోని బ్లాక్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన పోస్టులకు అనుగుణంగా జిల్లాకు కేటాయించిన సీఈఓ, డీఈ, ఇతర సెక్షన్ల సిబ్బంది శుక్రవారం సాయంత్రం విధుల్లో చేరారు. జిల్లాలో 19 మండల పరిషత్తులతో కొత్త జిల్లా పరిషత్ ఏర్పడింది. ఇప్పటి వరకు అన్ని ఫైళ్లు కాకినాడ జిల్లా పరిషత్‌కే వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి అన్ని అభివృద్ధి పనులు, పంచాయతీల పాలన, ఉపాధి హామీ, పారిశుధ్యం, వీధి దీపాలు, నిధుల కేటాయింపులు వంటి అంశాలన్నీ అమలాపురం కేంద్రంగానే పర్యవేక్షించనున్నారు. నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు వల్ల మండల అధికారులు, సర్పంచులు కాకినాడ వరకు వెళ్లాల్సిన అవసరం తప్పిందని, త్వరితగతిన పనులు పూర్తవుతాయని సిబ్బంది తెలిపారు.


