నీట మునిగిన ఆత్రేయపురం పోలీస్ స్టేషన్
భారీ వర్షాలకు అధ్వానంగా మారిన పెదపట్నం–మానేపల్లి రోడ్డు
సాక్షి, అమలాపురం: తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాను రెండున్న రోజుల పాటు వర్షం ముంచెత్తింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు తెరిపిచ్చింది. పలుచోట్ల ఎండ కూడా రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రహదారులపై చేరిన వర్షపు నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే వరుస వర్షాలతో పంట కాలువలు, డ్రైన్లు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా సాధారణం కాలేదు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 51.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామచంద్రపురంలో అత్యధికంగా 102.2 మిల్లీమీటర్లు, మలికిపురంలో అత్యల్పంగా 24.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆత్రేయపురంలో 46.4, ఆలమూరులో 40.2, రావులపాలెంలో 64.2, కొత్తపేటలో 70.6, కె.గంగవరంలో 44.2, ఐ.పోలవరంలో 40.8, ముమ్మిడివరంలో 56.4, అయినవిల్లిలో 56.6, పి.గన్నవరంలో 39.8, అంబాజీపేటలో 49.8, మామిడికుదురులో 47.4, రాజోలులో 49.2, సఖినేటిపల్లిలో 59, అల్లవరంలో 43.4, అమలాపురంలో 39.8, ఉప్పలగుప్తంలో 55.2, కాట్రేనికోనలో 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
10 వేల ఎకరాల్లో చేలల్లో ముంపు
వరుస వర్షాలతో ఐ.పోలవరం, ముమ్మిడివరం, అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం, మలికిపురం, మామిడికుదురు, రాజోలు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో వరి చేలు వర్షం బారినపడ్డాయి. ప్రస్తుతం పొలాల్లో నిలిచిన నీటితో పెద్దగా నష్టం లేకపోయినా.. మురుగునీటి కాలువల ద్వారా నీరు సకాలంలో బయటకు వెళ్లకపోతే పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అయితే అమలాపురం మండలం నల్లమిల్లి, జనుపల్లిలో మాత్రం చేలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మరోవైపు వరుసగా కురిసిన వర్షాలతో జనజీవనం కొంత స్తంభించింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి వర్షం తెరపివ్వడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఈ వర్షాలు ఈ ఏడాది ఇప్పటివరకు ఉన్న వర్షాభావ పరిస్థితులకు కొంతమేర ఉపశమనం కలిగించాయని రైతులు భావిస్తున్నారు.
పెరుగుతున్న గోదావరి
వర్షం తగ్గుముఖం పట్టిన సమయంలో గోదావరి వరద మాత్రం క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 24వ తేదీ ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1,37,099 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 4.10 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో పి.గన్నవరం, అన్నంపల్లి అక్విడెక్టుల వద్ద కూడా వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం పెరిగినా.. అధికారులు ముందుగా అంచనా వేసినంత వేగంగా పెరుగుదల కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి కోనసీమలో అంచనా వేసిన స్థాయిలో భారీ వరద వచ్చే సూచనలు కనిపించడం లేదని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 1.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద పెరిగినా పరిస్థితి అదుపులోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి లంక గ్రామాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు, లంక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నీట మునిగిన పోలీస్ స్టేషన్
ఆత్రేయపురం: భారీ వర్షాలకు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ నీట మునిగింది. కనీసం స్టేషన్‌కు వెళ్లడానికి వీల్లేకుండా మోకాలు లోతు నీరు చేరింది. స్టేషన్‌లోకి సైతం నీరు రావడంతో పోలీస్ సిబ్బంది రికార్డులు, కంప్యూటర్లు, ఆయుధ సామగ్రి పాడవుతుందని ఆందోళన చెందుతున్నారు. కాగా నీటిని మోటార్ల ద్వారా అల్లూరి పార్కులోని చెరువులోకి తోడుతున్నారు.
ఫ జిల్లాపై వాయుగుండం ప్రభావం
ఫ రెండు రోజులు ఎడతెరిపి లేని వర్షాలు
ఫ శుక్రవారం ఉదయం నుంచి కాస్త ఊరట


