వై.రామవరం: మండలంలోని చింతలపూడి పంచాయతీ బంగారుబందలు గ్రామానికి చెందిన బలిజె సుబ్బమ్మ (56) ప్రమాదవశాత్తూ కొండవాగులో జారి పడి మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని కొండవాగుకు గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఆమె ఎంతకూ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు వాగు పరిసరాల్లో గాలించినా సాయంత్రం వరకు జాడ తెలియరాలేదు. లోతట్టు గ్రామం కావడం, మార్గం మధ్యలో కొండ వాగులు ఉధృతంగా పొంగి పొర్లుతూండటం, విద్యుత్ సరఫరా లేక, సెల్ టవర్లు పని చేయక ఈ సమాచారం శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే తహసీల్దార్ శ్రీరాములుదొర, ఎంపీడీఓ బాపన్నదొర, ఎస్సై పృథ్వీయాదవ్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరాజులు ఆ గ్రామానికి అగ్నిమాపక శకటాన్ని, సిబ్బందిని తీసుకుని వెళ్లారు. వాగు కాస్త శాంతించడంతో గ్రామస్తుల సహకారంతో సంఘటన స్థలం వద్ద గాలించగా.. సుబ్బమ్మ మృతదేహం కొండవాగులో శుక్రవారం మధ్యాహ్నం లభ్యమైంది. ఆమె మృతదేహాన్ని గ్రామస్తులు జోలి కట్టుకుని అక్కడి నుంచి గ్రామంలోకి తీసుకొచ్చారు. కొండవాగులు పొంగుతూండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఆటంకం ఏర్పడింది.


