ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీ

Sep 11 2026 9:52 AM | Updated on Sep 11 2026 9:52 AM

రావులపాలెం పంచాయతీ కార్యాలయంలో కలకలం

అనధికారిక లే అవుట్లు,

అక్రమ భవనాలపై విచారణ

రావులపాలెం: రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆకస్మిక తనిఖీలు చేయడం కలకలం రేపింది. రాజమహేంద్రవరం రేంజ్‌ ఏబీసీ అడిషనల్‌ ఎస్పీ భవ్య కిషోర్‌ ఆధ్వర్యాన సీఐలు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్‌, సిబ్బంది ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ తనిఖీలు చేపట్టారు. పలు అంశాలపై పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ భవ్య కిషోర్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం తనిఖీలు, డాక్యుమెంట్ల పరిశీలన కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామ పంచాయతీ పరిధిలో సరైన అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు వేశారని, అనధికారిక భవనాలు నిర్మించారని వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేస్తున్నామని వివరించారు. ప్రాథమికంగా సుమారు 60 అనధికారిక లే అవుట్లు, 85 అక్రమ భవనాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిలో కొన్నింటికి నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదని, మరికొన్నింటికి నోటీసులు ఇచ్చినప్పటికీ తదుపరి చర్యలు తీసుకోకుండా వదలేశారని గుర్తించామన్నారు. తనిఖీలు రెండు మూడు రోజుల పాటు కొనసాగుతాయని, పూర్తయిన వెంటనే ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని ప్రజలు 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌ లేదా తనను 9440 44 6102 నంబరులో నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement