ఆత్రేయపురం: టీడీపీ నేతల నిర్వాకం పుణ్యమా అని భక్తులకు శివయ్య దర్శనాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. వివరాలివీ.. ఆత్రేయపురంలో 3 శతాబ్దాలకు పూర్వం నుంచి శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత రాజరాజేశ్వర స్వామి (శివాలయం) ఉంది. ఇక్కడ శివయ్యకు అత్రి మహర్షి సైతం పూజలు చేశారని పెద్దలు చెబుతారు. ఇంతటి ఖ్యాతికెక్కిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించే పేరుతో ఇక్కడి అర్చకుల ఇళ్లను టీడీపీ నేతలు మూడు నెలల కిందట దౌర్జన్యంగా కూల్చివేశారు. ఆ సందర్భంగా అర్చకులపై దౌర్జన్యానికి సైతం పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విధులు నిర్వహించడానికి అర్చకులు నిరాకరించారు. దీంతో, టీడీపీ నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు కొంతకాలం విధులు నిర్వహించాలని ప్రధానార్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మను కోరారు. దీనికి ఆయన మూడు నెలలు మాత్రమే గడువు ఇచ్చారు. ఆ గడువు పూర్తి కాగా, ఇప్పటి వరకూ వేరే అర్చకుడిని నియమించలేదు. ఈ నేపథ్యంలో ఆలయంలో సోమవారం నుంచి దర్శనాలు, అభిషేకాలు నిలిపివేసినట్లు భాస్కరశర్మ తెలిపారు. ఇక్కడ శివకేశవుల ఆలయాల పునర్నిర్మాణానికి భక్తులు రూ.1.50 కోట్ల వరకూ విరాళాలు అందించారు. ఇంతవరకూ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంపై దాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జీతాలివ్వండి మహాప్రభో..
అమలాపురం టౌన్: ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో జిల్లాలో పని చేస్తున్న 86 మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులు నానా అగచాట్లూ పడుతున్నారు. నిధి పోర్టల్ సక్రమంగా పని చేయడం లేదనే సాకుతో మే, జూన్, జూలై నెలలకు సంబంధించి జీతాలివ్వడం లేదని కోనసీమకు చెందిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కేశవ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 వేల మందికి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 300 మందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదని వివరించారు. ప్రభుత్వం తమకు నెలకు రూ.32,670 మాత్రమే జీతం ఇస్తోందని, అది కూడా సక్రమంగా ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. అటు కుటుంబ పోషణకు, ఇటు పాఠశాలలకు వెళ్లేందుకు మోటార్ సైకిళ్లలో పెట్రోలు పోయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. అసలే తమకు ఏడాదిలో 11 నెలలే జీతాలిచ్చి 12వ నెల పస్తులుంచుతున్నారని, ఇప్పుడు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఇటీవలి బదిలీల్లో దూర ప్రాంతాల్లోని పాఠశాలలకు పంపించడంతో ట్రావెలింగ్ ఖర్చులకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికై నా తమకు వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని కేశవ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పీజీఆర్‌ఎస్‌కు 254 అర్జీలు
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 254 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను పారదర్శకంగా, నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్ డి.అచ్యుత కుమారి, డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబ, సమగ్ర శిక్ష పీడీ మమ్మీ, డ్వామా పీడీ జీఎస్ రామగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 30 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తేలు తమ చాంబర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి, చట్ట పరిధిలో త్వరితగతిన విచారణ జరిపి, బాఽధితులకు న్యాయం చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించినవే ఉండటంతో ఆ అర్జీదారులకు కౌన్సెలింగ్‌లు నిర్వహించి, సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించారు.


