● ఆంక్షలను ఛేదించి..
బారికేడ్లను దాటుకుని..
● డీఎస్సీ అక్రమాలపై
జిల్లావ్యాప్తంగా ఎగసిన నిరసన
● భారీ పాదయాత్రలు,
మోటార్ సైకిల్ ర్యాలీలు
● లోకేష్ రాజీనామా చేయాలి
● సీబీఐ విచారణ జరపాలి
● మిన్నంటిన నినాదాలు
● మద్దతు తెలిపిన జెన్‌జీ
● వైఎస్సార్ సీపీ పిలుపునకు
విశేష స్పందన
సాక్షి, అమలాపురం: కోనసీమలో ఉద్యమ కెరటం ఎగసింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు నైతిక బాధ్యత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలనే డిమాండ్లతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన సోమవారం వేలాదిగా ప్రజలు భారీ పాదయాత్రలు, మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఈ నిరసన ర్యాలీలకు జెన్‌జీ యువత, విద్యార్థులు, కొన్ని ప్రాంతాల్లో డీఎస్సీ అభ్యర్థులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలకు ఆటంకం కలగకూడదనే కారణంతో ఈ ర్యాలీలకు అనుమతులు లేవంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి నుంచే పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పలువురికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆంక్షల సంకెళ్లను తెంచుకుని, పోలీసులు పెట్టిన బారికేడ్లను దాటుకుని మరీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలు నిర్వహించారు.
కొత్తపేటలో మోటార్ సైకిల్ ర్యాలీ
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన నియోజకవర్గంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రావులపాలెం డిగ్రీ కళాశాల నుంచి రావులపాలెం సెంటర్, వెదిరేశ్వరం, మందపల్లి మీదుగా నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేట సెంటర్ వరకూ ఈ ర్యాలీ సాగింది. జగ్గిరెడ్డి స్వయంగా మోటారు సైకిల్ నడుపుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. డీఎస్సీ అక్రమాలపై నినాదాలు చేశారు. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం, కొత్తపేట పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ కరపత్రాన్ని జగ్గిరెడ్డి అందించి, నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాలకు చెందిన వందలాది మందితో పాటు నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గొల్లపల్లి డేవిడ్‌రాజు, కర్రి నాగిరెడ్డి, బూత్ కమిటీల ప్రధాన కార్యదర్శి మార్గాని గంగాధరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంక్షలను అధిగమించి..
జిల్లా కేంద్రమైన అమలాపురంలో మోటార్ సైకిల్ ర్యాలీకి పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్‌కు ఆదివారం రాత్రి నోటీసు అందించారు. మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అయినప్పటికీ ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాలతో పాటు పట్టణం నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. భట్నవిల్లిలోని విశ్వరూప్ ఇంటి నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకూ సుమారు 1.50 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఎర్రవంతెన వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుని మరీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగారు. పాదయాత్రలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య కుమార్, ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు చీకట్ల కిషోర్, సీనియర్ నాయకులు ఉండ్రు వెంకటేష్, సలాది సతీష్ పాల్గొన్నారు.
పి.గన్నవరంలో..
పి.గన్నవరంలో మోటార్ సైకిల్ ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పార్టీ కార్యాలయం నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకూ పాదయాత్ర నిర్వహించారు. అయినవిల్లి, పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి వాసు, సీనియర్ నాయకుడు మందపాటి కిరణ్ కుమార్, సోషల్ మీడియా విభాగం కన్వీనర్ దొమ్మేటి సత్యమోహన్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
రాజోలులో..
శివకోడు నుంచి రాజోలు మీదుగా తాటిపాక వరకూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరీదేవి ఆధ్వర్యాన జరిగిన ఈ ర్యాలీకి మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), నియోజకవర్గ పరిశీలకుడు దంగేటి రాంబాబు, సీఈసీ సభ్యుడు కేఎస్‌ఎన్ రాజు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాముల దేవిప్రకాష్, పార్టీ సీనియర్ నాయకులు భూపాతిరాజు సత్తిబాబురాజు, రుద్రరాజు చినరాజా, నల్లి డేవిడ్, తెన్నేటి కిషోర్, చింత ప్రసాద్, కంచర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో...
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం తిమ్మాపురం నుంచి కాట్రేనికోన వంతెన వరకూ బైక్ ర్యాలీ నిర్వహించాలని భావించగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో, పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యాన కాట్రేనికోన, తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల నుంచి వేలాదిగా వచ్చిన కార్యకర్తలు భారీ పాదయాత్ర నిర్వహించారు. మిన్నంటిన ప్రభుత్వ వ్యతిరేక, జై జగన్ నినాదాలతో ఈ ర్యాలీ సాగింది. పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎస్‌ఈసీ సభ్యురాలు కాశి బాల మునికుమారి, జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకష్ణ, పార్టీ కార్యదర్శులు పెయ్యిల చిట్టిబాబు, పెన్మత్స చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన జెన్‌జీ
రామచంద్రపురంలో వైఎసా్‌స్‌ర్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్ ఆధ్వర్యాన పార్టీ కార్యాలయం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకూ సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సెంటర్‌లో ధర్నా చేపట్టారు. రామచంద్రపురం పట్టణం, మండలంతో పాటు కాజులూరు, కె.గంగవరం నుంచి భారీగా వచ్చిన పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెన్‌జీ యువత పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.


