బీసీలకు మరోసారి బాబు మోసం | - | Sakshi
Sakshi News home page

బీసీలకు మరోసారి బాబు మోసం

Oct 4 2026 9:37 AM | Updated on Oct 4 2026 9:37 AM

– మాజీ ఎంపీ అనురాధ

అల్లవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ మోసం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు.. హైకోర్టు తీర్పు తర్వాత కూడా మరోసారి మోసానికి తెరతీశారని మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని తెలిసినా చంద్రబాబు ఈ విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. హైకోర్టులో గతంలో కొట్టివేసిన అంశాన్ని మళ్లీ అదే తరహాలో తీసుకురావడం బీసీలను వంచించడమేనని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా రిజర్వేషన్ల పేరిట చంద్రబాబు నాటకాలాడుతూ మరింత ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో నిలిచేలా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని అనురాధ డిమాండ్‌ చేశారు.

8న యువజనోత్సవాలు : కలెక్టర్‌

అమలాపురం రూరల్‌: జిల్లాలో యువజనోత్సవాలు ఈ నెల ఎనిమిదిన మండలంలోని భట్లపాలెంలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. కాకినాడ యువజన సర్వీసుల శాఖ (సెట్రాజ్‌) ఆధ్వర్యంలో బోనం వెంకట చలమయ్య ఇంజనీరింగ్‌ కళాశాలలో వీటిని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవాల పోస్టర్లను శనివారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. 15–29 సంవత్సరాల వయస్సు గల యువతీయువకులకు సాంస్కృతిక విభాగాల్లో జానపద నృత్యం (బృందం), జానపద గేయం (బృందం), నూక్కడ్‌ నాటక్‌ (బృందం), పెయింటింగ్‌, కవిత్వం తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినవారిని రాష్ట్ర పోటీలకు, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విజేతలను జాతీయ పోటీలకు పంపించనున్నట్టు చెప్పారు. వివరాలకు సెట్రాజ్‌ కార్యాలయాన్ని 89191 35344, 98853 53033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సెట్రాజ్‌ సీఈవో కేఎస్‌వీ కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు

పరిష్కరించాలని వినతి

అమలాపురం రూరల్‌: గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వీబీ జీ రామ్‌జీ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ఈ నెల 10వ తేదీలోగా పరిష్కరించాలని కోరుతూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. జేసీ వైఖోం నైదియాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, డ్వామా పీడీ రామ్‌గోపాల్‌లకు వినతి పత్రాలు అందజేశారు. వీబీ జీ రామ్‌జీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతభత్యాల్లో ఏళ్ల తరబడి పెంపుదల లేదని వివరించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అర్హులైనవారికి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం నియామకాలు చేపట్టాలన్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి శాఖలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఉద్యోగులందరూ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు ఎండీ నాగప్రసాద్‌, ఎన్‌.శ్రీనివాస్‌, ఎం.త్రినాథ్‌, వై.రమేష్‌, రాజామణి తదితరులు పాల్గొన్నారు.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటికిటలాడింది. శనివారం పర్వదినం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు నిండిపోయాయి. భక్తులు స్వామివారి వ్రతాలు ఆచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఐదువేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement