18వ రోజుకు చేరిన
నిరవధిక సమ్మె
ఆత్రేయపురం: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 18వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో వారు మంత్రి కందుల దుర్గేష్‌ను రాజమహేంద్రవరంలోని నివాసంలో కలసి వినతిపత్రం సమర్పించారు. అసలే తమవి చాలీచాలని జీతాలని, మరోపక్క నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగిపోయాయని, దీంతో జీవితాలు వెళ్లదీయడం కష్టంగా మారిందని వివరించారు. వెంటనే తమ జీతాలు పెంచాలని ఆయన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల ఏడున జరిగే కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు వారు చెప్పారు.
ఆత్రేయపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న శిబిరంలో శనివారం వీఆర్‌ఏల సంఘ మండల అధ్యక్షుడు లోవరాజు, కార్యదర్శి ప్రసాద్‌ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా పేస్కేలు అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని వంటి డిమాండ్లతో నిరవధిక సమ్మె కొనసాగించారు. ఈ సమ్మెలో వీఆర్‌ఏల నాయకులు ఎలిజబెత్, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


