● ఏడాదిలో వరుసగా రెండు సార్లు వరద
● నదీగర్భంలోకి తూర్పు లంక భూములు
● ఆందోళనలో బడుగువానిలంక ప్రజలు
ఆలమూరు: గౌతమీ గోదావరికి ఓ పక్క గ్రోయిన్ల నిర్మాణం సాగుతున్నా ఏటా సంభవిస్తున్న వరదల వల్ల శ్రేష్టమైన లంక భూములు నదీగర్భంలో కలసిపోతున్నాయి. మండలంలో మడికి, బడుగువానిలంక, చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, ఆలమూరు గ్రామాలు లంక పరీవాహక ప్రాంతంలో ఉండగా, బడుగువానిలంక ద్వీపం మాదిరిగా గోదావరిలో అంతర్భాగంగా నది ఒడ్డున ఉంది. గోదావరికి ఎప్పుడు వరదలు వచ్చినా బడుగునివానిలంకపై ప్రభావం పడుతోంది. దశాబ్ద కాలంలో ఆ గ్రామానికి చెందిన సుమారు 800 ఎకరాలు గోదావరి పాలయ్యాయి. ఈ సమస్యపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో సుమారు మూడు కోట్లతో గ్రోయిన్లు నిర్మించారు. అలాగే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఓఎన్‌జీసీ సహకారంతో రూ.42 కోట్లు, ఈ ఏడాది రూ.60 కోట్లతో మళ్లీ నిర్మించారు. ఈసారి తూర్పు వైపు లంక భూములకు కోతలు విస్తరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నందునే..
గోదావరికి మునుపెన్నడూ లేని విధంగా గత ఏడాది నాలుగు సార్లు ఈ ఏడాది రెండు సార్లు వరదలు సంభవించడంతో పాత, కొత్త గ్రోయన్ల కలయిక మధ్య ఊబి సంభవించి చిన్నపాటి లీకేజీ ఏర్పడింది. దీంతో వరద ప్రభావానికి మళ్లీ లంక భూముల కోత ప్రారంభమైంది. అలాగే కొండాలమ్మ గుడి సమీపంలో మళ్లీ కోత మొదలైంది. బర్మా సొసైటీ (రెడ్లు లంక)కి చెందిన రెండు ప్రదేశాల్లో నదీ కోత విపరీతంగా జరిగింది. కేవలం ఈ నెలలోనే అరటి, దొండ, గులాబీ వంటి పంటలతో ఉన్న ఈ భూములు కళ్లముందే కొట్టుకుపోతుంటే రైతులు నిశ్చేషులవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే లంక భూముల తరువాత జిరాయితీ భూములతో పాటు బడుగువాని లంక గ్రామానికీ ముప్పు తప్పదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం
బడుగువానిలంక కింది భాగం నదీ తీరంలో లంక భూములు కోతకు గురవుతున్న వాస్తవమే. ఈ సమస్యను గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపించాము. రాష్ట్ర హెడ్ వర్క్స్ కమిషనరేట్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
రైతులు ఆందోళనను గుర్తించి ఉన్నతాధికారులకు తరచూ నివేదికలను అందజేస్తున్నాం.
– జె.విశ్వనాథరాజు, ఇంజినీరింగ్ జేఈ, హెడ్ వర్స్, కొత్తపేట డివిజన్
నదీ తీరం వెంబడి గ్రోయిన్లు నిర్మించాలి
మండలంలోని బడుగువానిలంక నదీ పరివాహక ప్రాంతంతో పాటు మడికి, చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, ఆలమూరు గ్రామాల వెంబడి ఉన్న లంక భూములకు గ్రోయిన్లు నిర్మించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు సత్వరమే స్పందించి వరద తగ్గుముఖం పట్టిన వెంటనే మిగతా లంక భూముల వెంబడి మళ్లీ గ్రోయన్స్ పనులు చేపట్టి బంగారు పంటలు పండించే లంక భూములను పరిరక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


