యాక్షనే.. ప్లానింగ్‌ లేదు | - | Sakshi
Sakshi News home page

యాక్షనే.. ప్లానింగ్‌ లేదు

Oct 4 2026 9:37 AM | Updated on Oct 4 2026 9:37 AM

● రబీకి గోదావరి డెల్టాలో

నీటి ఎద్దడి తప్పదా?

● గోదావరిలో తక్కువ ఇన్‌ఫ్లోతో ఆందోళన

● మెరక, శివారు ప్రాంతాలకు

నీరు చేరడం కష్టమే

● ఏటా 75 వేల ఎకరాలకు నీటి ఎద్దడి

● ప్రత్యామ్నాయంగా ఆరుతడి

పంటల వైపు దృష్టి

● 9.60 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు

● ముందస్తు ప్రణాళిక లేకుంటే

రైతులకు నష్టం

సాక్షి, అమలాపురం: చంద్రబాబు ప్రభుత్వం అంటే యాక్షన్‌ తప్ప ప్లానింగ్‌ ఉండదు.. ప్రచారమే తప్ప ప్రణాళిక ఉండదు.. అని చాలామంది చెప్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ గోదావరి డెల్టాలో రబీ వరి సాగు. డెల్టాలో రబీ సాగుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, గోదావరిలో తక్కువ ఇన్‌ఫ్లో నేపథ్యంలో రబీలో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. డెల్టాలోని మొత్తం వరి ఆయకట్టుకు నీటిని అందించేందుకు ముందస్తు ప్రణాళిక లేకపోతే మెరక, శివారు ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాల్సి ఉన్నా.. ఆ దిశగా వ్యవసాయ శాఖ నుంచి ఇప్పటివరకు పెద్దగా కార్యాచరణ కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

గోదావరి డెల్టా పరిధిలోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో వచ్చే డిసెంబరు ఒకటి నుంచి రబీ సాగు షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. గోదావరి డెల్టా పరిధిలోని మూడు డెల్టాల్లో సుమారు 9.60 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉంది. ఈ విస్తీర్ణానికి కనిష్టంగా 90 టీఎంసీలు, గరిష్టంగా 110 టీఎంసీల నీరు అవసరమవుతుందని అంచనా. ఈ ఏడాది గోదావరిలోకి వస్తున్న నీటి ప్రవాహం గతంతో పోలిస్తే తక్కువగా ఉండటంతో మొత్తం ఆయకట్టుకు నీరు అందించడం సవాలుగా మారనుంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచే డెల్టాలో సాగునీటి సమస్య రైతులను వెంటాడింది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం తదితర మండలాల్లోని పలు ప్రాంతాల్లో నారుమడులు ఎండిపోయాయి. రైతులు కాలువల్లోకి దిగి నిరసనలు తెలిపిన ఉదంతాలున్నాయి.

75 వేల ఎకరాలకు ఏటా సమస్యే..

డెల్టా పరిధిలో సుమారు 1.30 లక్షల ఎకరాల మెరక, శివారు ఆయకట్టు ఉంది. ఇందులో దాదాపు 75 వేల ఎకరాలకు నీరు సమృద్ధిగా ఉన్న సమయంలోనూ సక్రమంగా చేరడం లేదని అధికారులు, రైతులు చెబుతున్నారు. ఉప్పలగుప్తం, అయినవిల్లి, అల్లవరం, రాజోలు, మలికిపురం, మామిడికుదురు, అమలాపురం, కె.గంగవరం ప్రాంతాలతో పాటు కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు, కరప, కాజులూరు, పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) పరిధిలో ఈ సమస్య అధికంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో కడియం, అనపర్తి, పెదపూడి మండలాల్లోనూ మెరక, శివారు ప్రాంతాలకు ఏటా నీటి ఎద్దడి తప్పడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే రైతులు నీటి ఎద్దడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. డెల్టా పంట కాలువలు అత్యంత అధ్వానంగా ఉండటంతో శివారు ప్రాంతాల్లోనే కాకుండా కాలువను ఆనుకుని ఉన్న చేలకు కూడా సాగు నీరు అందలేదు.

ఆరుతడి పంటలపై దృష్టి

రబీలో నీటి లభ్యత తక్కువగా ఉంటే మెరక ప్రాంతాల్లో వరికి బదులుగా మొక్కజొన్న, నువ్వులు, అపరాలు వంటి ఆరుతడి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి రైతులను ప్రత్యామ్నాయ సాగుకు సిద్ధం చేయాలి. అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి. ఒకేసారి పెద్ద ఎత్తున అపరాల సాగు చేస్తే అందుకు అవసరమైన విత్తనాలను ఇప్పటి నుంచే సేకరించాల్సి ఉంది. ఆరుతడి పంటలను సాగు చేసే విధంగా రైతులను మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంది. దీనిపై వ్యవసాయ శాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించాలి. ఈ నెలలోనే మూడు జిల్లాల పరిధిలో సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించి రబీ నీటి లభ్యత, సాగు విస్తీర్ణంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముందస్తు ప్రణాళిక లేకుండా మొత్తం ఆయకట్టులో వరికి అనుమతిస్తే.. నీటి కొరత సమయంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి డెల్టా పరిధిలోని ప్రధాన పంట కాలువలు, వాటికి అనుబంధంగా ఉన్న చానల్స్‌, పంట బోదెలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఖరీఫ్‌ సాగు తర్వాత వీటిలో పూడికలు తొలగించడం, పంట కాలువలతో పాటు మురుగునీటి కాలువలను కూడా మరమ్మతులు చేయడం తప్పనిసరి.

1624 టీఎంసీలే ఇన్‌ఫ్లో

ధవళేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద నమోదైన ఇన్‌ఫ్లో గణాంకాలు పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. గత పుష్కర కాలంలో అత్యల్పంగా 2017లో 1291.80 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1624.157 టీఎంసీల నీరు బ్యారేజీకి చేరింది. ఇన్‌ ఫ్లో తక్కువ ఉన్న నేపథ్యంలో రబీకి అవసరమైన నీటి లభ్యతను ఇప్పటి నుంచే అంచనా వేయాల్సి ఉంది. సహజ జలాల రాక, సీలేరు నుంచి వచ్చే నీరు, పోలవరం ప్రాజెక్టు వద్ద నిల్వ ఉన్న నీటిపై ఇప్పటికే అంచనాలు రూపొందించాల్సి ఉన్నప్పటికీ జల వనరుల శాఖ అధికారులు ఇంకా దృష్టిసారించిన దాఖలాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement