అమలాపురం రూరల్: కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తక్షణం ఉపసంహరించుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు.. ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కలెక్టరేట్ వద్ద సోమవారం మహా ధర్నా, జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కారెం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజన్ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఐ.మంగాదేవి మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా అమెరికాతో చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పంటల ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం అదనంగా పెంచి మద్దతు ధర కల్పించాలని, కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు ఇవ్వాలని, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి, పని దినాలను 200 రోజులకు పెంచాలని, రోజు కూలీ రూ.700 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్కీమ్ వర్కర్లకు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులతో పాటు బ్యాంకుల ద్వారా పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలు తక్షణం ఆపకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


