రాజవొమ్మంగి: మండలంలోని ఏ.వణకరాయి గ్రామానికి చెందిన పల్లాల మంగ (38) సోమవారం సాయంకాలం ఇంటి వద్ద విద్యుత్‌షాక్‌తో మరణించింది. పొలం పనుల నుంచి ఇంటికి వచ్చిన మంగ కాళ్లు కడుక్కొని లోనికి వెళుతుండగా మీటర్ నుంచి వేలాడుతున్న వైర్ తగలడంతో షాక్‌కు గురైంది. కాళ్లు తడిగా ఉండటంతోనే ఆమె తీవ్ర విద్యుత్‌షాక్‌తో మరణించిందని భావిస్తున్నారు. మంగను షాక్ నుంచి రక్షించే క్రమంలో ఆమె భర్త నాగిరెడ్డి షాక్ ధాటికి దూరంగా వెళ్లి పడ్డాడు. కాగా అప్పటికే అపస్మారక స్థితిలో వున్న మంగను, ఆమె భర్త నాగిరెడ్డిని గ్రామస్తులు వెంటనే జడ్డంగి పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మంగ మృతి చెందినట్లు మెడికల్ ఆఫీసర్ డా.నాగార్జున ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబం, గ్రామంలో విషాదం అలుముకొంది. రోజువారి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న నిరుపేద దంపతులు మంగ, నాగిరెడ్డిలకు ముగ్గురు పిల్లలు వున్నారు. తల్లి మరణంతో పిల్లలు అనాథలయ్యారు.
అరిగెలవారిపేటలో
మరో వివాహిత..
పి.గన్నవరం: ఇనుప రేకులతో నిర్మించిన షెడ్డులో నివసిస్తున్న వివాహిత సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన మండలంలోని జి.పెదపూడి శివారు అరిగెలవారిపేటలో జరిగింది. ఎస్సై ఇ.నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అరిగెలవారిపేటకు చెందిన పమ్మి సత్యనారాయణ ఇనుప గొట్టాలు, రేకులతో షెడ్డు నిర్మించుకుని భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి అందరూ ఇంట్లో నిద్రించారు. తర్వాత ఎలుకలు విద్యుత్ వైర్లు కొరకడంతో ఆ షెడ్డుకు విద్యుత్ ప్రసరించింది. సోమవారం ఉదయం అతడి భార్య శ్యామల (49) చీపురుతో ఇల్లు ఊడుస్తూ ఇనుప గొట్టాన్ని పట్టుకుంది. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మిగిలిన వారు షెడ్డును ముట్టుకోపోవడంతో ప్రమాదం తప్పింది. శ్యామల మృతదేహానికి కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.


