● 15న భీమవరంలో
ఆక్వా సదస్సుకు జగన్ హాజరు
● ఆక్వా రైతులు తరలి రావాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి
తాళ్లరేవు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతోనే ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఇంజరం పంచాయతీ అరటికాయలంకలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యాన, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు ముదునూరి సతీష్‌రాజు, మెండా వెంకన్న, పిన్నమరాజు శ్రీనివాసరాజు, వేగిరౌతు రాజబాబు తదితరులు తమ సమస్యలు వివరించారు. ఇరవయ్యేళ్ల క్రితం ఆక్వా మేత బస్తా రూ.1,200 ఉండగా ప్రస్తుతం రూ.2 వేలకు పైగా పెరిగిందన్నారు. అయితే, 20 ఏళ్ల క్రితం ఉన్న రొయ్యల ధరలు కూడా ప్రస్తుతం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా జోన్‌లోని చెరువులన్నింటికీ విద్యుత్ సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని వాపోయారు. రొయ్యల రైతులకు ఎప్పటికప్పుడు ధరలను తెలియజేసే ఆక్వా బ్రహ్మ యాప్‌లో రొయ్యల ధరలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలు విన్న అనంతరం ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఆక్వా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కంచే చేను మేస్తున్న చందంగా ఎగుమతిదారులతో ప్రభుత్వం కుమ్మకై ్క ఆక్వా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆక్వా రైతులకు మేలు చేస్తారని రెండేళ్లుగా ఎదురు చూశామని, ఇప్పటికీ వారికి న్యాయం జరగకపోవడంతో ఈ నెల 15న భీమవరంలో ఆక్వా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్‌కు కూడా ఈ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని, రైతులకు న్యాయం జరిగేందుకు ఆయన రైలులోనైనా భీమవరం వచ్చి అండగా ఉంటారని చెప్పారు. ఈ సదస్సుకు ఆక్వా రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు పీ–4 కార్యక్రమంలో చెరువులన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పారని, కానీ, చెయ్యేరు చెరువు అదే మాదిరిగా ఉందని అన్నారు. రెండెకరాల నుంచి వేల కోట్లకు ఎదిగిన చంద్రబాబు ఆ కిటుకు ఏమిటో రైతులకు చెప్పాలని జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు.
మరో ముఖ్య అతిథి, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోతోందని అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన నాయకులు మేత కంపెనీలు, ఎక్స్‌పోర్టర్లతో కుమ్మక్కవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆక్వా రైతులకు మేలు జరిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యలపై మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ నెల 15న భీమవరంలో జరిగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పార్టీలకతీతంగా ఆక్వా రైతులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు రాష్ట్ర విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబీ, జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, పార్టీ అమలాపురం, రాజోలు, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరిదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్, పాటి శివకుమార్, కె.ఆదిత్య, నాయకులు పితాని బాలకృష్ణ, కాశి బాలమునికుమారి, ఏడిద సుబ్బు తదితరులు పాల్గొన్నారు.


