● నేటితో ముగియనున్న ప్రక్రియ
● డిజిటలైజేషన్‌కు జిల్లాలో
ఇంకా లక్షకు పైగా ఓట్లు దూరం
● మ్యాపింగ్ కాని ఓట్లు 18,433
● రెండు లక్షలకు పైగా తేడాలు
సాక్షి, అమలాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు మంగళవారంతో తెర పడనుంది. గత నెల 15న ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓ) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నింపిన అనంతరం తిరిగి స్వీకరించి, డిజిటలైజ్ చేసే ప్రక్రియ చేపట్టారు. అయితే, డిజిటలైజేషన్ ఇంకా పూర్తి కాకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో మొత్తం 13,15,007 మంది ఓటర్లకు గాను సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి 12,09,233 మంది వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మిగిలిన 1,05,774 మంది ఓటర్ల ఫారాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా డిజిటలైజేషన్ పురోగతి 91.96 శాతంగా నమోదైంది.
ఎన్నో సమస్యలు
జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి స్వీకరించడం, డిజిటలైజేషన్ వంటి ప్రక్రియలన్నీ పేపర్ల పరంగా అద్భుతంగా సాగినట్టు కనిపిస్తోంది. కానీ, సాంకేతికంగా కుటుంబ మ్యాపింగ్‌లో సమస్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికీ 18,433 ఓట్లు మ్యాపింగ్ కాలేదు. వీటిలో రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు 2,13,895 తేడాలు (తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో భారీ తేడా, పేర్లు, ఇంటి పేర్లలో తప్పుల వంటి) గుర్తించారు. వీటి పరిష్కారం కోసం బీఎల్‌ఓలు, ఆయా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఓట్లను సరిదిద్దడం వారికి శిరోభారంగా మారనుంది. చివరి రోజైన మంగళవారం పెండింగ్ ఫారాల నమోదు, మ్యాపింగ్ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.


