అమలాపురం రూరల్: ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామం దుప్పులలంకలో అక్రమంగా తవ్వుతున్న ఆక్వా చెరువులను వెంటనే నిలిపివేయాలనే డిమాండుతో గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని చెరువు పరిసరాల్లో ఎటువంటి అనుమతీ లేకుండా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడం వల్ల నీరు కలుషితమవుతోందని, భూగర్భ జలాలు ఉప్పగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, తాగునీటితో పాటు వ్యవసాయానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పంటలకు నీరందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పశువులకు కూడా ఆ నీటిని ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఆక్వా చెరువులను మూసివేసి, గ్రామస్తులకు రక్షణ కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ సుబ్బారావుకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.
అర్జీల పరిష్కారంపై
శ్రద్ధ చూపాలి
అమలాపురం రూరల్: ప్రజల నుంచి అందిన అర్జీలను తక్షణం పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి 101 అర్జీలు స్వీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా, వారి సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
కాకినాడ డీఎంహెచ్‌ఓగా అనిత
కాకినాడ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ)గా కోనాల అనితను నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ అనిత ఏలేశ్వరం మెడికల్ ఆఫీసర్‌గా 1998లో తొలి పోస్టింగ్ పొందారు. 1999లో పిఠాపురంలో మెడికల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి, 2002 వరకూ కొనసాగారు. అప్పటి నుంచీ 2004 వరకూ కాకినాడ జీజీహెచ్ వైద్యాధికారిగా, అనంతరం బదిలీపై 2013 వరకూ పిఠాపురం, రావికంపాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోను పని చేశారు. 2013లో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉద్యోగోన్నతి పొంది, కోనసీమ జిల్లా పి.గన్నవరం బదిలీ అయ్యారు. 2014–17 మధ్య కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా అధికారిగా పని చేశారు. 2017–21 మధ్య పెదపూడి పీహెచ్‌సీ సూపరింటెండెంట్‌గా పని చేశారు. 2021 నుంచి 2025 జనవరి వరకూ కాకినాడ జీజీహెచ్‌లో డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో డీసీఎస్ ఆర్‌ఎంఓగా పని చేశారు. ఆపై సీఎస్ ఆర్‌ఎంఓగా ఉద్యోగోన్నతి పొంది, అదే నెలలో శ్రీకాకుళం డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీల్లో కాకినాడ డీఎంహెచ్‌ఓగా అనిత నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పని చేసిన డాక్టర్ నరసింహ నాయక్ జవహర్ బాల ఆరోగ్య రక్ష రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు
వేతనాల మంజూరు
ఆలమూరు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ దశల వారీగా వేతనాలు మంజూరవుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఐదు నెలల నుంచి వేతనాలు మంజూరు చేయడం లేదు. ఈ సమస్యపై ‘అందనిధి’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 3న కథనం ప్రచురించింది. దీంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు విస్తృత కథనాలను ‘సాక్షి’ ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నిధి యాప్‌లోని లోపాలను గుర్తించింది. దీంతో, నిధి పోర్టల్‌ను పక్కన పెట్టి, ఈ ఏడాది జూన్ వరకూ గతంలో మాదిరిగా సీఎఫ్‌ఎంఎస్ విధానంలో వేతనాలు మంజూరు చేశారు. తమ సమస్యలను ‘సాక్షి’.. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ వేతనాలు మంజూరయ్యాయని కాంట్రాక్టు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.


