చంద్రబాబు మాటలు.. నీటిమూటలు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాటలు.. నీటిమూటలు

Jul 14 2026 12:12 AM | Updated on Jul 14 2026 12:12 AM

కాలువ చివరి భూములకు

అందని సాగునీరు

ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు

కొత్తపేట: కాలువ చివరి భూములకు సైతం సాగునీరు సమృద్ధిగా అందిస్తున్నామని ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద సోమవారం నిర్వహించిన రైతు సభలో సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పారు. కానీ, ఆయన మాటలకు, ఆచరణకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ప్రధాన పంట కాలువలో నీరున్నా వాటికి అనుబంధంగా ఉన్న పిల్ల కాలువల (చానల్స్‌) ద్వారా ఆయకట్టుకు నీరందడం లేదు. వాడపాలెం ఓల్డ్‌ చానల్‌ కింద బిళ్లకుర్రు పంచాయతీ పరిధి నక్కావారిపేట పరిసరాల్లో సుమారు 60 ఎకరాలకు సాగునీరు అందక నేటికీ నారుమడులు వేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై ఇరిగేషన్‌ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో యెలిశెట్టివారిపాలెం, నక్కావారిపేట, డేగలవారిపాలెం, వాకాడవారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఈ నెల 6న నీరు లేని కాలువలో కూర్చుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ, వారం గడిచినా ఫలితం శూన్యం. అలాగే, అవిడి కట్లమ్మ గుడి మీదుగా వెళ్లే పోతురాజు కాలువకు ఇరువైపులా ఆయకట్టుకు నీరందక వరి నారుమడులు బీటలు తీస్తున్నాయని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. సుమారు 100 ఎకరాలకు సంబంధించి వేసిన నారుమడులు పెరిగినా కాలువకు సక్రమంగా నీరు సరఫరా కాక దమ్ములు చేయలేని దుస్థితి నెలకొంది. సాధారణంగా రబీ సీజన్‌లో సాగునీరు సక్రమంగా అందక వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకుంటున్నామని, ఈసారి ఖరీఫ్‌లో సైతం వరి సాగు చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఆయకట్టు రైతులంతా మంగళవారం సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని రైతు సంఘం నాయకుడు యెలిశెట్టి త్రిమూర్తులు తెలిపారు.

బిళ్లకుర్రు నక్కావారిపేట వద్ద చుక్క నీరు లేని చానల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement