● వాడపల్లిలో భక్తుల అవస్థలు
● క్యూలో దర్శనానికి పాట్లు
● అన్న ప్రసాదం స్వీకరించడానికి ఇబ్బందులు
● పూర్తికాని వకుళమాత అన్నదాన భవనం
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ప్రతి శనివారం సుమారు లక్ష మంది వరకు వస్తున్నట్టు అంచనా. అయితే వీరి రద్దీకి తగినట్టు ఇక్కడ సౌక ర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నిలబడే భోజనం
ఆలయంలో ప్రతి శనివారం సుమారు 30 వేల మందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. మిగతా రోజుల్లో సుమారు 10 వేల మంది తాత్కాలిక భవనంలో అన్నదానానికి హాజరవుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి, దర్శనం పూర్తి చేసుకుని, ఆపై నిలబడి అన్నప్రసాదం స్వీకరించడానికి అవస్థలు పడుతున్నారు. ఆలయ పార్కింగ్ ఆవరణలో వకుళమాత శాశ్వత అన్నదాన భవన నిర్మాణ పనులు ఏళ్ల తరబడి పూర్తి కావడం లేదు. నాలుగేళ్లు కావస్తున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు.
తాత్కాలిక షెడ్డులో వసతుల కొరత
భక్తుల భోజనాలకు తాత్కాలిక భవనంలో సరైన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. అక్కడ కూర్చోడానికి బల్లలు లేవు. చిన్నపాటి వర్షం వచ్చినా పార్కింగ్ ఏరియా మొత్తం బురదగా మారుతోంది. తాత్కాలిక అన్నదాన భవనంలోకి వెళ్లడానికి సైతం భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, ఆలయం ఎదురుగా కోనేరు అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 2.80 కోట్లు మంజూరు చేశారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఈ ఆలయంలో ప్రాకార మండపం, అన్నదాన భవనం తదితర అభివృద్ధి పనులు చేపట్టి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు.


