నిడదవోలు రూరల్: పొట్ట చేత పట్టుకుని.. రాష్ట్రాలు దాటుకుని.. ఊరు కాని ఊరు వచ్చాడు. గ్రామాల్లో వెలుగులు నింపే పనులు చేస్తున్నాడు.. అంతలోనే ఊహించని విధంగా అతడిపై మృత్యువు పంజా విసిరింది. ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం జరగడంతో.. బిగిస్తున్న వైర్ల పైనే అతడి దేహం నిర్జీవంగా వేలాడింది. చూస్తున్న వారిని ఈ విషాదం కన్నీటి సంద్రంలో ముంచింది. వివరాలివీ.. ఓ ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుడు కరెంట్ స్తంభంపై విద్యుత్ షాక్‌తో మృతి చెందిన విషాద సంఘటన నిడదవోలు మండలం కంసాలిపాలెంలో చోటు చేసుకంది. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌లోని భాదా మర్కిలిండీ ప్రాంతానికి చెందిన రామసింకు (33) రెండు నెలలుగా ఓ కాంట్రాక్టర్ ద్వారా కంసాలిపాలెంలో త్రీఫేజ్ విద్యుత్ లైన్ పనులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తోటి కార్మికులతో కలసి మంగళవారం సాయంత్రం కరెంట్ స్తంభాలు, వైర్ల ఏర్పాటు పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో కరెంట్ స్తంభం పైకి ఎక్కిన రామసింకు వైర్లు సరి చేస్తూండగా విద్యుత్ షాక్‌కు గురై వెంటనే మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే రామసింకు మృతి చెందాడని తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తాము లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) తీసుకున్నామని, రిటర్న్ కరెంట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మృతుడు రామసింకుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని తోటి కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఫ లైన్లు వేస్తూండగా విద్యుత్ ప్రవాహం
ఫ షాక్‌తో స్తంభంపై
ఝార్ఖండ్ కార్మికుడి మృతి


