అమలాపురం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి 2014 –2018లో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎఫ్‌ఎస్‌కే ఎఫ్‌డీసీ పథకాల ద్వారా రుణం పొందిన వారు ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లిస్తే 2025డిసెంబర్ 31 వరకు ఉన్న వడ్డీని రద్దు మాఫీ చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి గురువారం తెలిపారు. ఈ సదుపాయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 66 మంది వినియోగించుకుని, రూ.25.23 లక్షల అసలును చెల్లించి రూ.24.55 లక్షల వడ్డీ మాఫీ పొందారన్నారు.
వీధి వ్యాపారులు
ఆహార నాణ్యత పాటించాలి
జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య
అమలాపురం టౌన్: వీధి వ్యాపారులు ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వై.రామయ్య సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అమలాపురం శాఖ ఆధ్వర్యంలో స్థానిక మెప్మా కార్యాలయ ప్రాంగణంలో పట్టణంలోని వీధి వ్యాపారులకు గురువారం జరిగిన అవగాహన సదస్సులో రామయ్య ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆహార భద్రతపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమలాపురం మెప్మా సిటీ మిషన్ మేనేజర్ మంగాదేవి, జిల్లా మెప్మా ప్రతినిధి మోహన్‌కుమార్, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు సీతామహాలక్ష్మి, కృష్ణవేణి, హాసన్‌పవన్‌కుమార్‌తోపాటు ఆర్‌పీలు, పట్టణ వీధి వ్యాపారులు పాల్గొన్నారు.
ఉగాది కథల పోటీ
కరపత్రాల ఆవిష్కరణ
ఆలమూరు: మండలంలోని సంధిపూడికి చెందిన బాలమందిరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉగాది కథల పోటీలను నిర్వహిస్తున్నట్లు రచయిత కృష్ణశ్రీ గురువారం తెలిపారు. ఆలమూరు శాఖా గ్రంథాలయంలో వెటర్నరీ ఏడీఏ ఎల్.అనిత, గ్రంథాలయాధికారి టి.నమశ్శివాయ, పాఠకుల చేతుల మీదుగా కథల పోటీల కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. కృష్ణశ్రీ మాట్లాడుతూ ఈ పోటీలకు కథలను పంపే గడువును మార్చి 12 నుంచి 16వ తేదీ వరకూ పెంచామన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు, విలువలకు అద్దం పట్టే విధంగా, కుటుంబ వ్యవస్థను బలపరిచే విధంగా, గతంలో ఎక్కడా ప్రచురితం కాని, హామీ పత్రంతో కూడిన కథలను పంపించవచ్చునని చెప్పారు. కథలు పంపే రచయితలు వాట్సాప్ ద్వారా 9963163136 నంబరుకు పంపాలని కోరారు. వచ్చిన కథలను బాలమందిరం కార్యాలయంలో ఈ నెల 19న పరిశీలించి అందులో నాలుగింటిని ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 22న విజేతలకు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని పేర్కొన్నారు.
న్యూక్లియర్ ఎనర్జీపై అవగాహన
మలికిపురం: ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతంలో బీచ్ సాండ్ హెవీ మినరల్స్ సమృద్ధిగా లభిస్తున్నాయని ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అణు శాస్త్రవేత్త తడక మహేశ్ తెలిపారు. మండలంలోని పడమటి పాలెం జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఖనిజాలు భారతదేశ రక్షణ రంగం, అంతరిక్ష రంగం, ఇతర కీలక పరిశ్రమలకు అత్యంత అవసరమని వివరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


