ముమ్మిడవరం: విద్యార్థుల సమగ్రాభివృద్ధిని సాధించడం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ పేర్కొన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఫరక్–2024 రెండురోజుల వర్క్‌షాపును ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్ధుల అభ్యాసన స్థాయిని కేవలం పరీక్షల ద్వారానే కాకుండా వారి ఆలోచనా శక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యం, సృజనాత్మకతతో పాటుగా జీవన నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయాలన్నారు. విద్యార్థులలో లోతైన అవగాహనను పెంపొందించడం వల్ల ఉపాధ్యాయుల బోధనా విధానాలను మరింత ప్రభావవంతంగా మార్చడం సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మండలానికి ఎనిమిది మంది వంతున 186 మందితో వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రైనింగ్ కో ఆర్డినేటర్ సమగ్ర శిక్షా ఏఎంఓ పి.రాంబాబు, రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట, డీవైఈఓలు పి.రామలక్ష్మణమూర్తి, జి.సూర్యప్రకాష్, కడలి వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్షా ఫైనాన్స్ అకౌంట్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఎంఈవో మోకా ప్రకాష్, మాట్లాడారు. అనంతరం రిసోర్స్ పర్సన్స్ కె.కృష్ణసాయి, ఆర్.వెంకటేశ్వరరావు, గణేష్, నరసింహారావు, ఏ.చంద్రసూర్యం ఫరక్–2024 ప్రకారం విద్యావ్యవస్ధ బలోపేతంపై అవగాహన కల్పించారు.
ఫరక్ రెండు రోజుల వర్కుషాపు ప్రారంభం


