● ల్యాబ్ టెక్నీషియన్ల దురవస్థ
● ఆదుకోని ప్రభుత్వం
● ఉద్యోగాలు అంతంత మాత్రం
● యాప్‌లు, హోం సర్వీసుల
పేరిట నాణ్యత లేని సేవలు
● నేడు ల్యాబ్ టెక్నీషియన్స్ డే
కాకినాడ క్రైం: ప్రభుత్వ సాయం లేదు.. యాప్‌లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు.. స్వయం ఉపాధి పొందుదామన్నా దక్కని ప్రోత్సాహం.. కార్పొరేట్ ల్యాబ్‌లలో అంతంత మాత్రం జీతాలకే ఊడిగం చేయాల్సి రావడం.. పర్యవేక్షణ లోపం.. ఇటువంటి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు (ఎల్‌టీ) రోడ్డున పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని నిర్ధారించి, వైద్య సేవల్ని నిర్దేశించడంలో వారీ పాత్ర కీలకం. కానీ, ఎల్‌టీలుగా పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక.. తగినంత సంపాదన లేక తమ భవిత అగమ్య గోచరమైపోయిందని ఆవేదన చెందుతున్నారు. జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ప్రత్యే కథనం..
ఉద్యోగాలు లేక విలవిల
జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 400 మంది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేస్తున్నారు. వీరు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నా వ్యాపారాలు లేవంటూ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఎండమావిగానే మిగులుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేవే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ పోస్టులు. అవి కూడా ఏనాటికో ఒక నోటిఫికేషన్. ఓవైపు చదివిన చదువుకు విలువ లేక, పట్టాలు పొందినా ఉద్యోగాలు రాక, సొంత వ్యాపారాలకు అవకాశం లేక, ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేక ఎల్‌టీల పరిస్థితి కడు దయనీయంగా ఉంటోంది. కుటుంబాలతో సహా రోడ్డున పడే దుస్థితిని ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక బతుకు తెరువు కోసం జొమేటో, బ్లింకిట్, స్విగ్గీ, ర్యాపిడో వంటి వాటిల్లో డెలివరీ బాయ్స్‌గా, కెప్టెన్లు పని చేస్తూ బతుకు బండి నెట్టుకొస్తున్నారు.
సవాల్‌గా స్వయం ఉపాధి
పోనీ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఎవరైనా ల్యాబ్ ఏర్పాటు చేసినా తీవ్ర నష్టాలు తప్పడం లేదు. గతంలో ఓ ల్యాబ్ ద్వారా కనీసం నలుగురు జీవనోపాధి పొందే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం అద్దె డబ్బులైనా రాని పరిస్థితి. మిషనరీ, రియేజంట్ల ధరలు కూడా ఎక్కువగా ఉండటం వ్యాపారానికి సవాల్‌గా మారింది. తాజాగా జీఎస్‌టీ సవరణలో తగ్గుదల కనిపించినా అది కంటితుడుపు చర్యగానే మిగిలింది. గతంలో ఏదో ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఒక ల్యాబ్‌ను నెలకొల్పి బతికేవాడు. ఇప్పుడు పలు ఆసుపత్రుల్లో వైద్యులే సొంతంగా ల్యాబ్‌లు పెట్టుకోవడం వీరి ఉపాధిని దెబ్బ తీస్తోంది.
ఆన్‌లైన్ సేవల పేరుతో..
వివిధ ఆన్‌లైన్ యాప్‌లు కూడా ఎల్‌టీల జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. వీటికి స్థానికంగా ల్యాబ్‌లేవీ ఉండవు. పార్టనర్ ల్యాబ్స్ పేరిట అనుసంధానమవుతున్నారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అది ఎంతవరకూ నిజమో పర్యవేక్షించేవారెవ్వరూ ఉండరు. వీరు పరీక్షలు చేసే యంత్రాలు, రియేజంట్ల నాణ్యత ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వచ్చి నమూనాలు సేకరిస్తారు. డబ్బులు తీసుకుంటారు. తరువాతి రోజు వాట్సాప్‌కు రిపోర్టు పంపిస్తారు. ఈ మధ్యలో ఏం జరిగిందో, ఎక్కడ పరీక్షించారో ఎవ్వరికీ తెలియవు.


