వాడపల్లి వెంకన్నకు వెండి కలశం సమర్పణ
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారికి ఓ కుటుంబం వెండి కలశాన్ని సమర్పించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కీర్తిశేషులు గొట్టుముక్కల అప్పలరాజు, లక్ష్మీకాంతం, కదిరాజు సూర్యనారాయణరాజు, సూర్యకాంతంల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 842 గ్రాముల వెండి కలశం తయారుచేయించి, బుధవారం దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావుకు సమర్పించారు.
దివ్యాంగ జేఏసీ
జిల్లా కార్యవర్గం
అమలాపురం టౌన్: స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో అఖిల భారత దివ్యాంగ జేఏసీ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. కార్యక్రమానికి దివ్యాంగ జేఏసీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కొమ్ముల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా దివ్యాంగ జేఏసీ గౌరవాధ్యక్షుడిగా కేతా శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా పెనుమాల నాగరాజు, సలహదారుగా నిమ్మకాయల సురేష్, ఉపాధ్యక్షుడిగా జొన్నాడ ప్రభాస్‌రాజు, కార్యదర్శిగా కొప్పాడి వెంకట నాగరాజు, సహాయ కార్యదర్శిగా కోడేటి పాండురాజు, కోశాధికారిగా సలాది మూర్తి, మహిళా అధ్యక్షురాలిగా విత్తనాల సూర్య వెంకట గౌరి, ఉపాధ్యక్షురాలిగా పలివెల ఉమాదేవి ఎన్నికయ్యారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా వాసంశెట్టి లక్ష్మీనారాయణ, సలాది నాగబాబు, కంటిపూడి సాయి భారతి, గొలకోటి మహాలక్ష్మిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పురస్కారం అందుకున్న దివ్యాంగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల కోటేశ్వరరావును నూతన కార్యవర్గ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
నేడు సత్యదేవుని
హుండీల లెక్కింపు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. దేవస్థానంలో హండీ ఆదాయాన్ని చివరిసారిగా డిసెంబర్ 31న లెక్కించారు. దీంతో 35 రోజులలో భక్తులు సత్యదేవుని హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించనున్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు.
నిత్యాన్నదానానికి
రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కాకినాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. కాకినాడ రమణయ్యపేటకు చెందిన గారికపర్తి నమశ్శివాయ కోట సూర్య నరసింహ, నాగమణి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,152 విరాళం అందజేశారు.
శాప్ అకాడమీల
ఏర్పాటుకు చర్యలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ, తిరుపతి, విశాఖలో ఆయా క్రీడల ప్రాధాన్యాన్ని బట్టి అకాడమీలు ఏర్పాటు చేస్తామని, కాకినాడను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) చైర్మన్ ఏ.రవినాయుడు ప్రకటించారు. బుధవారం కాకినాడ వచ్చిన ఆయన డీఎస్‌ఏలో విలేకరులతో మాట్లాడారు. జగన్నాథపురంలో రూ.9.84 కోట్లతో 16 ఎకరాల్లో క్రీడా వికాస కేంద్రం ఏర్పాటుకు ఆమోదం ఇచ్చామని తెలిపారు. రూ.1.81 కోట్లతో లింగంపర్తి, రూ.1.07 కోట్లతో పెద్దాపురం, రూ.76.80 లక్షలతో జగ్గంేపేటలో కేవీకేల నిర్మాణాలకు ఉత్తర్వులు జారీచేశామన్నారు.
వాడపల్లి వెంకన్నకు వెండి కలశం సమర్పణ


