గోదావరి సా..గుతోంది!
సాక్షి, అమలాపురం: ‘నీరు పల్ల మెరుగు’ అన్నది సామెత. కాని గోదావరి డెల్టాలో నీరు పల్లానికి పారడానికి చాలా ఆపసోపాలు పడుతోంది. ఈ జాప్యంతో శివారులలో సాగు ఆలస్యం కావడంతో పాటు రబీకి కీలక సమయంలో నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. రబీకి అవసరమైన నీటిలో సగానికి పైగా ఇప్పటికే విడుదల చేసినా డెల్టా పరిధిలోని శివార్లలో ఇంకా నాట్లు పూర్తికాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మధ్య డెల్టాలో రబీ ఇంకా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నాటికి గడువు దాటిన తరువాత కూడా ఆయకట్టుకు నీరందించాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలో మొత్తం 1.82 లక్షల ఎకరాల ఆయకట్టులో రబీ వరి సాగవ్వాల్సి ఉంది. అధికారులు మాత్రం 1.69 లక్షల ఎకరాల్లో రబీ సాగవుతోందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,59,545 ఎకరాల్లో మాత్రమే నాట్లు, వెదజల్లు పద్ధతిలో పూర్తి చేశారు. ఇంకా సుమారు 10 వేల ఎకరాలలో సాగు జరగాల్సి ఉంది. ప్రధానంగా జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం వ్యవసాయ సబ్ డివిజన్ల లోనే సాగు ఆలస్యమైంది. అమలాపురం మండలంలో మొత్తం ఆయకట్టు 5,400 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 3,285 ఎకరాలలో మాత్రమే నాట్లు వేశారు. ఉప్పలగుప్తం మండలంలో 6,500 ఎకరాలకు గాను 5,600 ఎకరాల్లో, అల్లవరం మండలంలో సుమారు 5 వేల ఎకరాల ఆయికట్టు ఉండగా 3,800 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి.
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లో సైతం నాట్లు పూర్తి కాలేదు. ఈ మండలాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. జిల్లాలో శివారు ప్రాంత మండలాలైన మామిడికుదురు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో నాట్లు ఇంకా పడుతూనే ఉన్నాయి.
పంట కాలువలకు 56.153 టీఎంసీలు
గోదావరి డెల్టాలో ఇప్పటికీ నాట్లు పడుతూనే ఉండగా, నీటి వినియోగం మాత్రం ఎక్కువగానే జరిగింది. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబీ)లో నిర్ణయించిన దాని ప్రకారం డిసెంబరు నెలాఖరు నాటికి నాట్లు, వెదజల్లులు పూర్తి కావాల్సి ఉంది. కాని ఫిబ్రవరి మొదటి వారం వచ్చినా ఇప్పటికీ నాట్లు వేస్తూనే ఉన్నారు. రబీ డెల్టా అవసరాల కోసం 93 టీఎంసీలు కావాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో సగానికి పైగా నీరు కాలువలకు విడుదల చేయడం జరిగింది. మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు మూడు డెల్టా కాలువలకు కలిపి 56.153 టీఎంసీల నీరు విడుదల చేశారు. దీనిలో తూర్పు డెల్టాకు 17.496, మధ్య డెల్టాకు 9.818, పశ్చిమ డెల్టాకు 28.839 టీఎంసీల చొప్పున వదిలారు.
సీలేరు పవర్ జనరేషన్ నుంచి నీరు తక్కువగా వస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తగ్గించారు. దీంతో ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీకి రోజుకు 8,832 క్యూసెక్కుల మాత్రమే నీరు వస్తోంది. దీనిలో సీలేరు నుంచి వచ్చేది 3,017 క్యూసెక్కులు కాగా, మిగిలిన 5,815 క్యూసెక్కులు పోలవరం వద్ద నిల్వ ఉంచారు. వస్తున్న నీటిని తూర్పు డెల్టాకు 2,600, మధ్య డెల్టాకు 1,700, పశ్చిమ డెల్టాకు 4,300 క్యూసెక్కుల చొప్పున మూడు డెల్టాలకు 8,600 క్యూసెక్కులు వదులుతున్నారు.
కాలువల వ్యవస్థ అధ్వానమే కారణం!
జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టా ప్రధాన పంట కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో శివారు, మెరక ప్రాంతాలకు నీరు అందడం లేదు. పూర్తి సామర్థ్యం మేరకు కాలువలకు నీరు వదులుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తూర్పు డెల్టాలో కోటిపల్లి బ్యాంకు కెనాల్, మండపేట, కోరింగ, మధ్య డెల్టాలో ముక్తేశ్వరం, పి.గన్నవరం బ్యాంకు కెనాల్‌లు, అమలాపురం, బెండా కెనాల్, ఐలెండ్‌లోని కాలువలు, వాటికి అనుబంధంగా ఉన్న కాలువలు, పంట బోదెల వ్యవస్థలు దారుణంగా ఉన్నాయి. తూడు, గుర్రపుడెక్క, అనధికార వంతెనలు, భవనాల నిర్మాణం, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాలువలు మూసుకుపోవడంతో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. పంట, మురుగునీటి కాలువలకు భారీగా నిధులు ఇచ్చామని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం జరగడం లేదు. కనీస మరమ్మతులు కూడా నోచుకోకపోవడం, పూడిక తొలగింపు లేకపోవడం వంటి కారణాల వల్ల నీరందక నాట్లు ఆలస్యమవుతోంది. సాగునీటి పారుదల, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం కొరవడం కూడా డెల్టాలో రబీ ఆలస్యానికి కారణంగా మారింది.
రబీ సాగు ఆలస్యం కావడం వల్ల కాలువల మూసివేత గడువు పెంచాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా మార్చి 31 నాటికి కాలువలు మూసివేస్తామని చెప్పే అధికారులు ఏప్రిల్ 15 వరకు గడువు పెంచుతున్నారు. ఈసారి అసాధారణ జప్యం జరగడం వల్ల ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది.
ఏ ఏటికా ఏడు శివారు రైతులు సాగునీటి కోసం అర్రులు చాచుకుని చూడడమే.. నీరెప్పుడొస్తుందా అని. నెర్రెలు పడిన నేలను చూసి ఆశలు వదులుకునే సమయానికి అదిగదిగో నీరొచ్చేస్తోంది అన్న కబురు వినిపిస్తుంది. అప్పటి నుంచి మళ్లీ పనులు ఊపందుకుంటాయి. ఏటా ఇవే అవస్థలా.. నీటి పారుదలలో ఎందుకింత జాప్యం అంటే కాలువల వ్యవస్థ అస్తవ్యస్తం అంటారు. మరి వాటినెందుకు బాగుచేయలేదంటే నిధులు ఇచ్చామని గొప్పగా చెప్తారు. వాటితో చేసిన పనులెక్కడంటే జవాబు ఉండదు. నీటి పారుదల, వ్యవసాయ శాఖల సమన్వయ లోపంతో ఏ పనీ చేయక.. ఎక్కడి తూడు అక్కడే.. ఎక్కడి ఆక్రమణలు అక్కడే.. అనధికార వంతెనల నిర్మాణాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువల్లో పూడికలు అన్నదాతను ఎండగట్టేస్తున్నాయి. గోదావరిలో సమృద్ధిగా నీరు.. చెంతనే సాగు భూములు.. అయినా నీరు లేక ఎండే పొలాలు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఎంతకాలం సాగుతాయో మరి.
నీరందక శివారు రైతుల గగ్గోలు
జిల్లాలో కొలిక్కి రాని రబీసాగు
ఇప్పటి వరకు 56.153
టీఎంసీల నీరు విడుదల
అవరోధాలతో ముందుకు పారని వైనం
యంత్రాంగం మధ్య సమన్వయ లోపం
నిధులున్నా మరమ్మతులకు
నోచుకోని కాలువలు
డిసెంబర్ 1 నుంచి
మొదలైనా పూర్తి కాని నాట్లు
ఏప్రిల్ నెలాఖరు వరకు
నీరివ్వక తప్పని పరిస్థితి
గోదావరి సా..గుతోంది!


