తడిబాటు తప్పదా! | - | Sakshi
Sakshi News home page

తడిబాటు తప్పదా!

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకులు

సాక్షి, అమలాపురం: ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులకు అడుగడుగునా ఆటంకాలే కలుగుతున్నాయి. పొలాలను తడిపేందుకు నీరు అందకపోవడంతో రైతులు తడబాటుకు గుర వుతున్నారు. విత్తు నుంచి విక్రయం వరకూ వారికి కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పుడు క్లోజర్‌ పనుల రూపంలో వారికి మరో ఇబ్బంది వచ్చింది. ఏప్రిల్‌ 15 నాటికి పంట కాలువలను మూసివేస్తామని, క్లోజర్‌ పనులతో పాటూ ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌, రిపేరు పనులను ప్రారంభిస్తామని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ప్రకటించారు. కానీ వాస్తవంగా ఏప్రిల్‌ 15 నాటికి పంట కాలువలు మూసివేసే పరిస్థితి గోదావరి డెల్టాలో లేదు. నెలాఖరు వరకు పంట కాలువలకు నీరు విడుదల చేయాల్సిందే. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టా పరిధిలోని శివారు ప్రాంతాలలో రబీ వరినాట్లు ఆలస్యం కావడంతో సాగు ఆలస్యమైన విషయం తెలిసిందే.

రబీ షెడ్యూల్‌ ఇదీ

గోదావరి డెల్టాలో ఏటా డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి రబీ షెడ్యూల్‌ మొదలవుతుంది. నాటి నుంచి రబీ అవసరాలకు అనుగుణంగా డెల్టాలోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు నీరు వదులుతుంటారు. గతంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరంగా జరిగిన ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు (సాగునీటి పారుదల సలహా మండలి– ఐఏబీ)లో అయినా, జిల్లా విభజన తర్వాత తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల వారీగా జరుగుతున్న ఐఏబీల సమావేశంలో అయినా ఒక్కటే షెడ్యూల్‌ చెబుతున్నారు. డిసెంబరు 1 నుంచి రబీ మొదలవుతుందని, అదే నెల చివరి రోజు 31వ తేదీకి నాట్లు, వెదజల్లు పద్ధతి పూర్తవ్వాలని సూచనలు చేస్తున్నారు.

నాట్లు పూర్తికాక..

ప్రతి ఏటా అనుకున్న సమయానికి నాట్లు పూర్తి కావడం లేదు. జనవరిలో సంక్రాంతి సమయంలో కూడా నాట్లు వేయడం పరిపాటిగా మారింది. ఈ కారణంగా ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీరు ఇవ్వడం తప్పనిసరి. అయితే ఈసారి సాగుకు అసాధారణ ఆలస్యమైంది. ఫిబ్రవరి మొదటివారంలో కూడా నాట్లు వేశారు. అటువంటి చోట నీరందకుంటే చివరిలో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుంది. ఇవన్నీ చూస్తే ఏప్రిల్‌ 15 నాటికి కాలువలు మూసివేయడం అసాధ్యమని రైతులంటున్నారు. కనీసం ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతున్నారు.

యంత్రాంగం విఫలం

సకాలంలో రైతులతో సాగు చేపట్టించడంలో అధికార యంత్రాంగం విఫలమవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఖరీఫ్‌లో మోంథా తుపానుకు రైతులు నష్టపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాల వల్ల రైతులు సాగు సకాంలో చేపట్టలేకపోయారు. ఈ కారణంగా మార్చి 31వ తేదీ నాటికి మొదలు కావాల్సిన వరి కోతలు మే మొదటి వారంలో కూడా కోసే పరిస్థితి నెలకొంది. అనుకున్న దానికన్నా ఎక్కువ నీరు ఇచ్చినప్పటికీ శివారు, మెరక ప్రాంతాలకు నీరు అందక రైతులు పడరాని పాట్లు పడ్డారు. ముఖ్యంగా వరిచేలు దుబ్బు చేసే ఫిబ్రవరి, గింజ తోడుకుని గట్టిపడే దశ మార్చి నెలలో సకాలంలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనితో ప్రత్యామ్నాయంగా సొంత మోటార్లతో మురుగునీటి కాలువల నుంచి, అలాగే విద్యుత్‌ మోటార్లతో నీరు తోడుకుని పంటను గట్టెక్కించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

నీటి ఇక్కట్లు

ప్రస్తుతం తూర్పు డెల్టాకు 3,400 క్యూసెక్కులు, మధ్య డెల్టా 2,100 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,300ల క్యూసెక్కులు చొప్పున మొత్తం 10,800 క్యూసెక్కుల చొప్పున డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇంత నీరు ఇస్తున్నా ఇప్పటికీ నీటి ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో శివారు ప్రాంతాలైన ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఛానళ్లు, పంట బోదెలు నీరు ఇంకి పోయి దర్శనమిస్తున్నాయి. మరోవైపు రైతులు మురుగునీటి కాలువలు, నీరు తక్కువగా ఉన్న పంట కాలువల నుంచి మోటార్లతో తోడుకునే దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి.

ఫ ఏప్రిల్‌ 15 నాటికి డెల్టా కాలువలు

మూసివేస్తామంటున్న అధికారులు

ఫ గోదావరి డెల్టా శివారుల్లో సాగు ఆలస్యం

ఫ దీని వల్ల నెలాఖరు వరకు

నీరు ఇవ్వాల్సిందే

ఫ సమృద్ధిగా ఉన్నా

శివారుకు అందని వైనం

ఫ అష్టకష్టాలు పడుతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement