అమలాపురం టౌన్: వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ సీడ్ టూ సీడ్ దిశగా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎంవీ రామారావు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీకళా గ్రాండ్స్‌లో మూడు రోజులుగా సాగుతున్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ సీజన్–2026 సన్నద్ధతపై గురువారం జరిగిన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రీ – మాన్‌సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానం ద్వారా విత్తనం నుంచి విత్తనం (సీడ్ టూ సీడ్) వరకూ కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం అనేది ఓ విప్లవాత్మకమైన ముందడుగు అని గుర్తు చేశారు. రైతులు ప్రకృతి వ్యవసాయం బాట పట్టేందుకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి బీవీ రమణ మాట్లాడుతూ జిల్లాలోని ప్రధాన పంటలైన కొబ్బరి, అరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమలు చేసేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాలు, జీవ ఉత్ప్రేరకాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు జిల్లాలోని బయో రిసోర్స్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
డీఎల్‌డీఓ విజయలక్ష్మికి
పదోన్నతి
రామచంద్రపురం రూరల్: రామచంద్రపు రం డివిజన్ డీఎల్‌డీఓ వి.విజయలక్ష్మికి పదోన్నతి లభించింది. ఆమె జిల్లా స్వర్ణ గ్రా మ, స్వర్ణవార్డు అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆమె గురువారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆమెను ఉద్యోగులు, సిబ్బంది సత్కరించారు.
గుడ్ ఫ్రైడే ప్రార్థనలకు
సర్వం సిద్ధం
అమలాపురం టౌన్: మానవులకు శాంతి, సహనం, దయ, ప్రేమ తదితర మార్గాలను చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు. భూమిపై మానవుల పాపాలను రూపుమాపడానికి శిలువపై మరణించిన కరుణామయుడు. ఆయన శిలువ మరణం పొందిన రోజును పురస్కరించుకుని గుడ్‌ఫ్రైడే ప్రార్థనలకు జిల్లాలోని అన్ని చర్చిల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని సుమారు 650 చర్చిల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అమలాపురం, రామచంద్రపురాల్లో క్రైస్తవులు.. ఏసుక్రీస్తు శిలువ మోసే ఘట్టాన్ని వివరిస్తూ ప్రదర్శనలు చేయనున్నారు. అమలాపురం కలెక్టరేట్ రోడ్డులోని మన్నా సిల్వర్ జూబ్లీ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనల కోసం స్థానిక మిరియాం గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 1500 నుంచి 2000 మంది పాల్గొనేలా వీటిని రూపొందించారు. అమలాపురం మెయిన్ రోడ్డులోని సెయింట్ లూథరన్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దళిత క్రైస్తవులను
ఎస్సీలుగా గుర్తించాలి
అమలాపురం రూరల్: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూషి జాన్ మోషే ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్ గెడ్డం సంపదరావు మాట్లాడుతూ శ్రీరామ నవమి రోజు ఆకివీడు గ్రామంలో డిప్యూటీ స్పీక ర్ రఘురామ కృష్ణంరాజు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జుత్తిక సత్యనారాయణ, కార్యదర్శి కోణాల ప్రకాష్, కోశాధికారి కాండ్రేగుల గంగరాజు, అమలాపురం ఇన్‌చార్జి పొలమూరి మోహన్ బాబు పాల్గొన్నారు.


