రావులపాలెం: జిల్లాలోని ఇసుక ర్యాంపులను మైనింగ్ శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గతంలో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జొన్నాడ, ఆలమూరు, ఊబలంక, ఆత్రేయపురం, వద్దిపర్రు, గోపాలపురం ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను కాకినాడ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.జగన్నాథరావు, ఏలూరు మైన్స్ ఏడీ వెంకటరత్నం, కోనసీమ జిల్లా మైన్స్ ఏడీ బి.అశోక్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. దీనిపై జిల్లా మైనింగ్ శాఖ ఏడీ అశోక్ కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇసుక ర్యాంపులపై పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేశారన్నారు. తవ్వకాల నియమ నిబంధనలు, ధరలు తదితర అంశాలను టెండర్లు దక్కించుకున్న కంపెనీలు సక్రమంగా అమలు చేస్తున్నాయా, లేదా, అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతులు ఇచ్చిన 11 సెమీ మేకనైజ్డ్ రీచ్‌లు ఉన్నాయన్నారు. వీటిలో నాలుగు రీచ్‌లకు ఈ ఏడాది డిసెంబర్ దాకా, మిగిలిన వాటికి మే నెలాఖరు వరకు కాల పరిమితి ఉందన్నారు. అలాగే 11 రీచ్‌ల్లోనూ సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణంలో ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇది కాకుండా ఐదు స్టాక్ పాయింట్లు వద్ద మరో 4.63 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక నిల్వ ఉందన్నారు. తనిఖీల్లో అనుమతులు ఇచ్చిన 11 రీచ్‌లే కాకుండా ఫిర్యాదులు అందిన ఆత్రేయపురం, ఆలమూరు, గోపాలపురం ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేశామన్నారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.


