బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్‌టీయూలో గురువారం 12 స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 18 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్‌టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహుతులతో కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది జూలై 4వ తేదీన వర్సిటీ 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు ఎనిమిది నెలల తరువాత హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్‌డీలు అందుకునేవారు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్.. శాంత బయోటెక్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కే.ఐ.వరప్రసాద్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఒక గంట ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సందడి చేశారు.
ప్రగతి వివరించిన వీసీ
ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తన ప్రసంగంలో వర్సిటీ సాధించిన ప్రగతి వివరించారు. దాదాపు 20 నిముషాల పాటు గవర్నర్ ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రేరణ కలిగించేలా ఆయన ప్రసంగం సాగింది. అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ కాకినాడ స్థిరపడిందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలో యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు ఒడిసి పట్టాలని సూచించారు. ముఖ్యంగా ఫైనాన్స్, లాజిస్టిక్స్, మానవ వనరుల నిర్వహణ, విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే ప్రాజెక్టులను ప్రొత్సహించాలన్నారు. యువత ఉద్యోగం కోసమే కాకుం డా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అలోచించాలని కోరారు. అనంతరం గవర్నర్ చేతుల మీదుగా 39 బంగారు పతకాలు, 48 పీహెచ్‌డీలు ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ డే అంటే యూనివర్సిటీతో సంబంధం ముగించడం కాదని, కేవలం యూనివర్సిటీ నుంచి ప్రపంచంలోకి ప్రవేశించడమన్నారు. శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అధ్యయనం చేస్తే ఇంజినీర్లు ప్రపంచాన్ని సృష్టిస్తారన్నారు. సైన్స్ రంగంలో పీహెచ్‌డీలు పొందిన సంఖ్యలో యూఎస్, చైనా తరువాత మూడో స్థానం భారతదేశం సాధించిందని, స్టార్టప్‌ల సంఖ్యపరంగా కూడా 3వ స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వీ.ఎస్.ఎస్. కుమార్, కే.వీ.ఎస్.జీ మురళీకృష్ణ, రామలింగరాజు, పాలక మండలి సభ్యులు బెజవాడ వీరవెంకట సత్యనారాయణ, సంకురాత్రి చంద్రశేఖర్, వర్సిటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
అందజేసిన పట్టాల వివరాలు
2024–25 విద్యాఏడాదికి గాను బీటెక్ 32,170, బిఫార్మశీ 1,450, ఎంటెక్ 679, ఎంబీఏ 1,326, ఎంసీఏ 1,115, ఎం ఫార్మశీ 116, బీబీఏ 28, ఫార్మడీ 944, బీఆర్క్ 70 ఓడీలు (ఒరిజనల్ డిగ్రీ) విద్యార్థులు పొందనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డిజిటల్ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల ఓడీలను వారికి చెందిన డీజీ లాకర్‌లో భద్రపరిచే విధానాన్ని గవర్నర్ రాష్ట్రంలో తొలిసారిగా యూనివర్సిటీలో ప్రారంభించారు.
అలా మొదలై.. ఇలా ముగిసి..
షెడ్యూల్ ప్రకారం స్నాతకోత్సవం ఉదయం 10.45 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. గంటా మూడు నిమిషాల ఆలస్యంగా 11.48 గంటలకు కార్యక్రమం ప్రారంభించారు.
11.49 గంటలకు గవర్నర్
అనుమతితో కార్యక్రమం ప్రారంభం
11.55కు పీహెచ్‌డీ,
గోల్డ్‌మెడల్ విజేతలతో ప్రతిజ్ఞ
12.00 గవర్నర్ అనుమతితో
వరప్రసాద్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
12.05 బంగారు పతకాలు,
పీహెచ్‌డీల ప్రదానం
12.30 ముఖ్య అతిథి
వరప్రసాద్‌రెడ్డి ప్రసంగం
12.45 గవర్నర్ ప్రసంగం
12.50 వీసీ ప్రసాద్ చేతుల మీదుగా
గవర్నర్, ముఖ్య అతిథులకు సత్కారం
1.00 గంటకు రెక్టార్ సుబ్బారావు
ధన్యవాదాలు, జాతీయ గీతంతో ముగింపు
వైభవంగా జేఎన్‌టీయూకే
12వ స్నాతకోత్సవం
కులపతి హోదాలో
హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్
శాంత బయోటక్ అధినేత
వరప్రసాద్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
39 బంగారు పతకాలు,
48 పీహెచ్‌డీల ప్రదానం
గంట ఆలస్యంగా ప్రారంభం


