ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గౌతమీ గోదావరిలో స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం హోమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే చక్రస్నానంలోనూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు సిష్టా సూర్య కుటుంబరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం గౌతమీ గోదావరి తీరంలో చోర సంవాదం జరిగింది.


