జాడలు సరే.. పులేది? | - | Sakshi
Sakshi News home page

జాడలు సరే.. పులేది?

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

జాడలు

జాడలు సరే.. పులేది?

అక్కమ్మతల్లికొండ వద్ద ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన బోను

అక్కమ్మతల్లి కొండవద్ద పరిశీలిస్తున్న ఫారెస్టు చీఫ్‌ కన్జర్వేటర్‌ చలపతిరావు

రాజమహేంద్రవరం రూరల్‌: ఐదు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచారం జిల్లా ప్రజలను వణికిస్తోంది. అటవీశాఖ అధికారుల అంచనాలను సైతం తారుమారు చేస్తూ ఇష్టారీతిన సంచరిస్తోంది. దీంతో అధికారులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పెద్దపులి చిక్కడం లేదు. మంగళవారం రాత్రి దివాన్‌చెరువు ఎస్‌వీపీసీ కల్యాణ మండపం వద్ద ప్రత్యక్షమైన పులి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ మీదుగా బీజాపురి టౌన్‌షిప్‌లోకి వెళ్లింది. బుధవారం ఉదయానికి చూస్తే రఘనాథపురంలో మామిడితోటల్లో నుంచి వెళ్లినట్లు ఉన్న ప్లగ్‌ మార్కులను అధికారులు గుర్తించారు. అక్కడ ఒక గేదె దూడపై దాడిచేయడంతో అది మృతి చెందింది. అక్కడ నుంచి శాటిలైట్‌ సిటీ అక్కమ్మతల్లి కొండపైకి వెళ్లినట్లు ప్లగ్‌మార్క్‌ల ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అక్కమ్మతల్లి కొండపై నుంచి కిందకు దిగిందా లేదా వెనుక నుంచి జీడిమామిడి తోటల్లోకి ఏమైన వెళ్లిందా అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం రాత్రి పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ చలపతిరావు నేతృత్వంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్‌ అధికారి దావీదురాజు, సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ కన్జర్వేటర్‌ చలపతిరావు మాట్లాడుతూ పెద్దపులి శాటిలైట్‌ సిటీలోని అక్కమ్మతల్లికొండపై ఉన్నట్లు గుర్తించామని, దానిని పట్టుకునేందుకు పూణే నుంచి ఒక బృందంతో పాటు, మొత్తం 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రజలకు పెద్దపులి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారన్నారు. ఈ పులి తడోబా నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రం పాల్వంచ మీదుగా ఏలూరు జిల్లా నుంచి మన జిల్లాలోకి వచ్చిందని ఆయన తెలిపారు.

పులిని పట్టుకునేందుకు రాత్రి వేళల్లో ధర్మల్‌ కెమెరాలను వినియోగించినట్టు తెలిపారు. ఇప్పటికే బోన్లతో పాటు ట్రాప్‌ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. పులి సంచరించిన స్థలాన్ని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందర్శించి ప్రజలకు సూచనలిచ్చారని తెలిపారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథం, తహసీల్దార్‌ బి.శ్రీనివాస్‌, ఎంపీడీవో ఆర్మ్‌స్ట్రాంగ్‌, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, ఎస్సైలు, సిబ్బంది అటవీశాఖ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు.

ఆందోళన చెందుతున్న

రాజమహేంద్రవరం ప్రజలు

పాద ముద్రలు తప్ప పులిని

పట్టుకోలేకపోతున్న అధికారులు

తాజాగా శాటిలైట్‌ సిటీ అక్కమ్మతల్లి

కొండపై ఉన్నట్టు గుర్తింపు

పూణే నుంచి నిపుణులతో పాటు

20 బృందాల ఏర్పాటు

జాడలు సరే.. పులేది?1
1/1

జాడలు సరే.. పులేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement