నేటి నుంచి యానాం ప్రజా ఉత్సవాలు
● ఫల, పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి
● అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రజా ఉత్సవాలకు సిద్ధమవుతున్న ప్రధాన వేదిక
యానాంలో విద్యుత్ కాంతులతో సిద్ధమైన ఫల, పుష్ప ప్రదర్శన ముఖద్వారం
యానాం: పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 22వ యానాం ప్రజా ఉత్సవాలు మంగళవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం వద్ద బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఈ నెల 8 వరకు మూడు రోజుల పాటు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షణలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్ అధ్యక్షతన జరగనున్న ప్రజా ఉత్సవాలతో పాటు 9 వరకూ ఫల, పుష్ప ప్రదర్శనను సైతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాషనాథన్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా స్పీకర్ సెల్వం, వ్యవసాయ మంత్రి సీడీజే కౌమార్, డిప్యూటీ స్పీకర్ రాజవేలు తదితరులు వస్తుండగా, ముగింపు వేడుకలకు పుదుచ్చేరి సీఎం రంగసామి, పర్యాటక మంత్రి కె.లక్ష్మీనారాయణన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్‌చౌహాన్, కలెక్టర్ కులోఽథుంగన్, కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ తదితరులు హాజరవుతారు.
కార్యక్రమాలు ఇలా..
మంగళవారం జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ఒడిశా కళాకారులచే ప్రత్యేక ప్రదర్శన, విశాఖ కళాకారులచే ఎల్‌ఈడీ లేజర్ మేస్ యాక్ట్, బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్‌చే జానపద గీతాలు, విశాఖ డీజే టిల్లు టీమ్ కార్యక్రమాలు, మధ్యప్రదేశ్ కళాకారులచే విజయేంద్ర ప్రత్యేక ప్రదర్శన ఉంటాయి. 7న కోల్‌కతా, పీఆర్ ఈవెంట్స్ ఫ్యాషన్ షో, పాశ్చాత్య నృత్య ప్రదర్శన, రష్యన్ కళాకారుల ప్రదర్శన, కోల్‌కతా కళాకారులచే గారడీ ప్రదర్శన, యానాం కళాకారుల తెలుగు సంప్రదాయ కళల ప్రదర్శన, 8న శాంతకుమార్ మిమిక్రీ, రింగ్ రిబ్బన్ డ్యాన్స్, సినీ ఆర్కెస్ట్రా, స్కైల్యాంట్రన్ నిర్వహించనున్నారు. ఆర్‌ఏఓ అంకిత్‌కుమార్, వ్యవసాయశాఖ డీడీ సీహెచ్ జోగిరాజు వివరాలను వెల్లడించారు.
ఉత్సవాలకు ముస్తాబు
ప్రజా ఉత్సవాలు, ఫల, పుష్ప ప్రదర్శనకు బాలయోగి మైదానం ముస్తాబయ్యింది. ఇప్పటికే వేదిక, ముఖద్వారాలు సిద్ధమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి పలువురు కళాకారులు చేరుకున్నారు. పోలీసులు సైతం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు.
నేటి నుంచి యానాం ప్రజా ఉత్సవాలు


