అయినవిల్లికి భక్తుల తాకిడి
అయినవిల్లి: నూతన ఆంగ్ల సంవత్సరం ఆరంభం సందర్భంగా గురువారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని, స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి అన్నదాన సత్రంలో 8,781 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్క రోజు రూ.5,01,248 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
మద్యం షాపుల వేళలు
పెంచడంపై ఆగ్రహం
అమలాపురం టౌన్: నూతన సంవత్సర వేడుకల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల వేళలను పెంచడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక గొల్లగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశం నూతన సంవత్సరం పేరు చెప్పి మద్యం షాపుల వేళలను పెంచడంపై మండిపడింది. ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వమే ఒక మద్యం వ్యాపారిలా ఆలోచించడం సిగ్గు చేటని ప్రజా సంఘాల ప్రతినిధులు విమర్శిఽంచారు. నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజుల పాటు మద్యం షాపులను మూసివేయాలని తాము వినతి పత్రాలు ఇస్తే అందుకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకూ షాపులు తెరచి ఉంచాలని జీవో ఇవ్వడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఇక్కడే ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యంపై ఉన్న చిత్తశుద్ధి అవగతమవుతోందన్నారు. కూలీలు, పేదలు, కార్మికుల కుటుంబాలను ఇప్పటికే ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి.దైవ కృప, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ కె.శంకర్ సమావేశంలో ప్రసంగించారు.
ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో
ఆశయ సాధన
పిఠాపురం: జీవితాశయ సాధనకు మానసిక శక్తి, మనోధైర్యం, సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానశక్తి అవసరమని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా పీఠంలో గురువారం నిర్వహించిన జ్ఞాన మహాసభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మనసును స్థాయి పరచుకునే తత్వమే ఆధ్యాత్మిక తత్వమని, దీని ద్వారా జీవితంలో చిన్న చిన్న వివాదాలు తొలగించుకుని, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి, మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఏర్పరచుకోవాలని అన్నారు. మనలోని లోపాలను సవరించుకోకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ లోపాలను తొలగించుకునే విధానమే ఆధ్యాత్మిక తత్త్వమన్నారు. మానవత్వాన్ని బోధించేదే మతమని, మానవత్వాన్ని హరించేది మతం కాదని, రాక్షసత్వమని అభివర్ణించారు. మనసును తాత్త్విక జ్ఞానశక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, గురు దక్షిణగా ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన కిరణ్ ప్రభ మాట్లాడుతూ, పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరించాయి. ఉమా ముకుంద నేతృత్వంలో సంగీత విభావరి రంజింపజేసింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా మహిళా యువతకు వస్త్రాలు, దంగేటి రామకృష్ణ సహకారంతో పీఠాధిపతి చేతుల మీదుగా ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు.
అయినవిల్లికి భక్తుల తాకిడి


