రావులపాలెంలో కొనసాగుతున్న పోలీస్ పికెట్
రావులపాలెం: స్థానిక ఎంకేఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వివాదం నేపథ్యంలో రావులపాలెంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఏవిధమైన అనుమతులు లేకుండా అధికార టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం నెలకొల్పగా స్థానికుల అభ్యంతరం మేరకు వారి తరఫున మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి బుధవారం రాత్రి ప్రశ్నించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆయనకు మద్దతుగా పోలీస్ స్టేషన్‌కు తరలిరావడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు గుడ్డతో చుట్టేశారు. విగ్రహం చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేసి డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆదేశాల మేరకు టౌన్, రూరల్ సీఐలు ఎం శేఖర్‌బాబు, సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. గురువారం కూడా సర్కిల్ పరిధిలోని సిబ్బంది ఈ సెంటర్లో పహరా కాశారు.
జగ్గిరెడ్డి, మరి కొంతమందిపై కేసు నమోదు
స్థానిక ఎంకేఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం. శేఖర్‌బాబు గురువారం తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా జగ్గిరెడ్డి విగ్రహం వద్ద జన సమూహంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జగ్గిరెడ్డితో పాటు మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.


