వాడపల్లికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: నూతన సంవత్సరం ఆరంభ వేళ కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకుని ఈ కొత్త ఏడాది తలపెట్టిన అన్ని పనులు సవ్యంగా జరగాలని, ఏడాది పొడవునా శుభప్రదంగా సాగాలని కోరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఆవరణలో స్వామి వారికి అష్టోత్తర పూజ, నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజే స్వామి వారికి రూ.8,32,482 ఆదాయం వచ్చినట్టు డిప్యూటీ కమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ర్యాలి శ్రీజగన్మోహినీ కేశవ, గోపాలస్వామి, ఉమా కమండలేశ్వర స్వామి, ఆలయాలను భక్తులు దర్శించారు.
ఆలయాలకు నూతన సంవత్సరం తాకిడి


